జగన్ మీద కోర్టుకు షర్మిల ?
జగన్ ని రాజకీయంగా ఎంత ఇరికిస్తే అంత ఆయన తగ్గుతారని అపుడు తాను వ్యక్తిగతంగానూ రాజకీయంగానూ జయించవచ్చు అన్నది షర్మిల మార్క్ వ్యూహం.
జగనన్న బాణం అడ్డం తిరిగి చాలా ఏళ్ళు అయింది. ఎదురు తిరిగి అధికారం కూడా దింపేసింది. ఆరు నెలల విపక్షంలో కూడా వైసీపీని టార్గెట్ చేస్తూనే ఉంది. ఏపీసీసీ చీఫ్ హోదాలో షర్మిల నుంచి దూసుకొస్తున్న బాణాలు నేరుగా వైసీపీ మీదకే వస్తున్నాయి.
తన సొంత అన్న జగన్ విషయంలో షర్మిల రాజకీయంగా తేల్చుకోవాల్సిన లెక్కలకూ ఆయనతో వ్యక్తిగతంగా ఉన్న ఆస్తుల వివాదాలకూ మంచి కనెక్షన్ ఉంది. జగన్ ని రాజకీయంగా ఎంత ఇరికిస్తే అంత ఆయన తగ్గుతారని అపుడు తాను వ్యక్తిగతంగానూ రాజకీయంగానూ జయించవచ్చు అన్నది షర్మిల మార్క్ వ్యూహం.
అందుకే ఆమె ఎందరు చెప్పినా ఎక్కడా తగ్గడం లేదు. జగన్ నే అజెండాగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. జగన్ ని ఏదో విధంగా బదనాం చేయాలని చూస్తున్నారు. ఆమెకు ఇపుడు చేతికి అంది వచ్చిన అస్త్రం అదానీ కేసు. అందులో జగన్ పేరు ఉందని వార్తలు రావడంతో కొన్నాళ్ల పాటు ఏపీలో రాజకీయంగా కలకలం రేగింది.
అయితే అది అంతలోనే చప్పబడిపోయింది కూడా. ఇక ఇదే విషయం మీద పార్లమెంట్ లోనూ విపక్షం రచ్చ చేసినా కధ అలాగే ఉంది. అయితే అదానీ వ్యవహారంలో చంద్రబాబు జగన్ మీద కేసులు పెడతారని షర్మిల ఆశించింది. ఆ విధంగా డిమాండ్ చేసింది. కానీ అనుకున్నది జరగలేదు అని అంటున్నారు.
అందుకే ఆమె పదే అదే చంద్రబాబుని ఈ కేసు విషయమై ప్రశ్నిస్తున్నారు. జగన్ కి అదానీ కంపెనీల నుంచి 1750 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న చంద్రబాబు ఎందుకు ఏపీలో అదానీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం లేదు అని షర్మిల లేటెస్ట్ గా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
కేవలం తనకు ముడుపులు ఇచ్చారన్న కారణంతోనే జగన్ నాడు ఎపీ ప్రజల మీద 1.5 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపారని ఆమె విమర్శించారు. ఈ విషయంలో చంద్రబాబు వెంటనే విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. జగన్ విషయంలో వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చాలని కూడా కోరారు.
ఒకవేళ చంద్రబాబు అందుకు సిద్ధపడకపోతే మాత్రం తానే కోర్టుకు వెళ్తాను అని ఆమె అల్టిమేట్ గానే ప్రకటించేశారు. ఇక షర్మిల జగన్ మీద ఏకంగా కోర్టుకు వెళ్తాను అంటూ చేసిన ఈ ప్రకటన అయితే రాజకీయంగా చర్చకు తావిస్తోంది.
జగన్ సొంత సోదరుడు అయినా ఆమె ఆస్తుల వివాదం మొదలైనప్పటి నుంచి రాజకీయంగా ముందుకు వచ్చారు. అన్న మీదనే పోరాటం సాగిస్తున్నారు. ఇపుడు ఆమె మరింతగా ముందుకు వెళ్ళి జగన్ మీద న్యాయ పోరాటం అని చెబుతున్నారు అంటే ఇపుడు వైసీపీ ఏమి చేస్తుంది అన్నది చూడాలని అంటున్నారు.
తన మీద అసత్య కధనాలు ప్రసారం చేశారని రెండు పత్రికల మీద జగన్ పరువు నష్టం దావా వేస్తూ కోర్టుకు వెళ్లారు. మరి ఇదే ముడుపుల భాగోతం మీద షర్మిల కోర్టుకు వెళ్తాను అంటున్నారు. ఇపుడు వైసీపీ ఏమి చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా జగన్ చుట్టూనే తన రాజకీయం తిప్పుకుంటూ వస్తున్న షర్మిల ఇపుడు అల్టిమేట్ దూకుడునే చూపించాలని అనుకుంటున్నారు.