వైఎస్ భారతి పీఏ అరెస్ట్ విషయంలో నిజమెంత?

ఇందులో భాగంగా ఆమె వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Update: 2024-06-22 04:50 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఘోర ఓటమి చవిచూసిన నేపథ్యంలో... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూ పలు వివాదాలు చుట్టుముడుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే... జగన్ ఇంట్లో ప్రభుత్వ ఫర్నిచర్ ఉంది అంటూ టీడీపీ నుంచి సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

ఇదే సమయంలో అత్యంత వివాదాస్పదంగా మారిన రుషికొండ ప్యాలెస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ నిర్మాణాలపైనా టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా ఈ నిర్మాణలా కోసం సుమారు రూ.450 కోట్లు ఖర్చు చేశారని.. అవన్నీ జగన్ తన సతీమణి భారతి కోసమే అని కామెంట్లు వినిపించాయి. ఈ సమయంలో భారతికి ఊహించని షాక్ తగిలిందని అంటున్నారు.

అవును... వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కి ఊహించని షాక్ తగిలిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆమె వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ వర్గం మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ మేరకు ప్రచారం ఊపందుకుంది. దీంతో... ఈ విషయం వైరల్ గా మారింది.

ప్రస్తుత ఏపీ హోంమంత్రి అనిత, వైఎస్ షర్మిళ, సునీత రెడ్డి మొదలైన మహిళా నేతలపై.. భారతి పీఏ రవీందర్ రెడ్డి అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని.. ఉద్దేశ్యపూర్వకంగా పోస్టులు పెట్టడమే కాకుండా అసభ్యకరమైన కామెంట్స్ చేసేవాడని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీకి చెందిన మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టేవాడని చెబుతున్నారు.

ఇదే సమయంలో మార్ఫింగ్ చేసిన ఫోటోలతో రచ్చ చేసేవాడని ఒక వర్గం మీడియా ఆరోపిస్తుంది! అదేవిధంగా... అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపైనా అతడు అసభ్యకరమైన పోస్టులు పెట్టినట్లు చెబుతున్నారు! ఈ వరుస భారీ ఆరోపణల నేపథ్యంలోనే భారతి వ్యక్తిగత సహాయకుడు రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా... రవీంద్రారెడ్డి కడప నుంచి కదిరి వెళ్లే మార్గ మధ్యలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే... వర్రా రవీంద్ర రెడ్డిని ఏ పోలీసులూ అరెస్ట్ చేయలేదని.. ఇదంత టీడీపీ చేస్తున్న ప్రచారం మాత్రమే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. కావాలనే వైసీపీపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలో... ఈ వ్యవహారానికి సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News