పవన్ పెళ్ళిళ్ళ గురించి జగన్...ఈసీకి జనసేన ఫిర్యాదు
పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ల గురించి జగన్ మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పటికి చాలా సార్లు ఇదే విషయం మాట్లాడారు
పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ల గురించి జగన్ మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పటికి చాలా సార్లు ఇదే విషయం మాట్లాడారు. దానికి పవన్ కళ్యాణ్ సహా జనసేన నేతలు ఫైర్ అవుతూ వచ్చారు. పవన్ అయితే గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. నా పెళ్ళిళ్ల గురించి మాట్లాడితే బాగుండదు అని హెచ్చరించారు.
అయినా జగన్ అదే ప్రస్తావిస్తున్నారు అని జనసేన మండిపడుతోంది. తాజాగా భీమవరం సభలో పవన్ పెళ్ళిళ్ళ గురించి జగన్ మాట్లాడారు. కార్లు మార్చినట్లుగా భార్యలను మారుస్తారు అని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇపుడు ఆయన కాకినాడ సభలో మరో అడుగు ముందుకేసి భార్యలను మాత్రమే కాదు నియోజకవర్గాలను మార్చేస్తున్నాడు అని హాట్ కామెంట్స్ చేశారు.
దాంతో జనసేన ఈసీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసింది. పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారని అంటూ ఏపీ సీఎం జగన్ పై జనసేన నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న భీమవరం సభలో పవన్ కల్యాణ్ పై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారని ఆరోపించారు.
జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందికే వస్తాయని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళలను కించపరిచేలా జగన్ మాట్లాడారని జనసేన నేతలు తమ ఫిర్యాదులో వివరించారు. సానుభూతితో గెలిచేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. మరి దీని మీద ఈసీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
అయితే పవన్ కళ్యాణ్ కూడా జగన్ గురించి జైలూ బెయిలూ అంటూ మాట్లాడడం వ్యక్తిగత విషయం కాదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మాట్లాడితే జగన్ కుటుంబం గురించి చంద్రబాబు పవన్ విమర్శలు చేస్తున్నారు అని వారు కౌంటర్ ఇస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో రాజకీయాలు నూటిని నూరు శాతం వ్యక్తిగత దూషణలకు పరిమితం అవుతున్నాయి. వారూ వీరూ అని కాకుండా అందరూ అదే పని చేస్తున్నారు దాంతో ఎన్నికల వేళ జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉన్నా అవే అందరి నోటా వస్తున్నాయి. మరి దీని మీద ఈసీ నిబంధనలు ఏమిటి ఎలా అమలు చేస్తుంది. అవి ఏ రకంగా వర్తింప చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.