జగన్ మార్క్ ప్రాయశ్చిత్తం...కేడర్ కి డైరెక్షన్

దేవుడిని మొక్కు కోవాలి. వేడుకోవాలి. కొన్ని సార్లు అపరాధం జరిగితే లెంపలేసుకోవాలి.

Update: 2024-09-25 15:30 GMT

దేవుడిని మొక్కు కోవాలి. వేడుకోవాలి. కొన్ని సార్లు అపరాధం జరిగితే లెంపలేసుకోవాలి. ఇపుడు ఏపీలో అదే తంతు నడుతోంది. ఎవరి వల్ల తప్పు జరిగింది అన్నది పక్కన పెడితే తిరుమలలో ఉపచారాలలో అపచారాలు జరిగాయని ప్రచారం సాగుతోంది. దీనిని నమ్ముతున్న వారు పెద్ద ఎత్తున ఉన్నారు వారి మనసులు కలత పడ్డాయి.

సరే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయింది అని తీవ్ర విమర్శలు చేశారు. దాని పర్యవసానాలు చూస్తే తీవ్రంగానే ఉన్నాయి. అనూహ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్త కోటి స్పందించింది. ఘోషించింది. దాంతో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తమదైన శైలిలో దిద్దుబాటు చర్యలకు దిగింది.

తిరుమలలో శాంతి హోమాన్ని సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ కార్యక్రమాలు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఆయన పదకొండు రోజుల పాటు ఈ దీక్షను నిర్వహిస్తున్నారు. పవన్ చూపిన దారిలో ఎక్కడికక్కడ జనసేన నేతలు కార్యకర్తలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ విధంగా విమర్శలు రాజకీయంగా ఒక వైపు మంటెత్తుతున్నా టీడీపీ జనసేన తమదైన హిందూ ధార్మిక కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఇక డిఫెన్స్ లో పడిన వైసీపీ ఇప్పటిదాకా కాచుకుంటూనే వచ్చింది. ఇపుడే ఆ పార్టీ కూడా కొత్త ఆలోచనలు చేస్తోంది.

తమ పార్టీ కార్యకర్తలు అంతా ఈ నెల 28వ తేదీన రాష్ట్రమలోని అన్ని వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలలో పూజలు చేయాలని ప్రాయశ్చిత్తంగా అన్ని కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది.

ఈ మేరకు జగన్ సోషల్ మీడియా ద్వారా శ్రేణులకు సందేశం పంపించారు. అంటే ఈ నెల 28న వైసీపీ అతి పెద్ద ఆధ్మాత్మిక కార్యక్రమాన్ని పార్టీకి నిర్దేశించింది అన్న మాట. ఆ రోజున వైసీపీ నేతలు కార్యకర్తలు పూజలు చేస్తారు.

అయితే ఇది టీడీపీ జనసేన బాటలోనే వైసీపీ చేస్తోంది అని అంటున్నారు. ఇప్పటికే ఆ రెండు పార్టీలు హిందూ మతంలోని భక్తుల విశ్వాసాలు దెబ్బ తినడాన్ని గమనించి తగిన తీరున చర్యలు చేపట్టాయి. వైసీపీ చాలా ఆలస్యంగా మేలుకొందని అంటున్నారు. ఇక వైసీపీ అయితే ఈ విషయంలో కూటమినే అనుసరించింది అని కూడా కామెంట్స్ వస్తున్నాయి.

పాపాలు పోవాలని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ఏపీలో పాపాలు ఎవరు చేశారు అంటే మేము కాదు వారు అని ఎదుటి వారిని విమర్శిస్తూ వస్తున్నారు. పాపం శమించుగాక అని అంటున్నారు. ఎదుటి వారు చేసిన పాపాలకు మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం సామీ అని కూడా అంటున్నారు.

ఇపుడు వైసీపీ కూడా అదే చేస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద మచ్చని వేసి చంద్రబాబు పెద్ద తప్పు చేశారని అందుకే పాప పరిహారార్ధం పూజలు చేయాలని వైసీపీ తన పార్టీ శ్రేణులను కోరుతోంది. ఇక టీడీపీ జనసేన వైసీపీ చేసిన తప్పులు అని ఆరోపిస్తున్న సంగతి విధితమే.

మొత్తానికి తప్పు జరిగిందని అంతా అంగీకరిస్తున్నారు. ప్రాయశ్చిత్తానికి కూడా దిగుతున్నారు. ఆ శ్రీవారు అంతా పై నుంచి చూస్తున్నారు. ఎవరిది తప్పు ఏవరిది ఒప్పు అన్నది ఆయనకే తెలుసు. ఇక భక్త కోటి అయితే ఈ రాజకీయ ప్రాయశ్చిత్తాల మీద పెద్దగా ఆసక్తిని కనబరచడంలేదు. స్వామినే వేడుకుంటోంది. ఆయనే అన్నీ సరిచేయాలని ప్రార్ధిస్తోంది. మొత్తానికి ఏపీలో ఆధ్యాంతిక రాజకీయం అయితే జోరుగా సాగుతోంది. దీని ఫలితాలు పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News