గుంటూరులో గుట్టుగా గృహప్రవేశం.. వైసీపీ నేత నిర్వాకం

అధికారంలో ఉన్నా.. లేకున్నా.. తమ తీరు మారదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు పలువురు.

Update: 2025-02-17 15:30 GMT

అధికారంలో ఉన్నా.. లేకున్నా.. తమ తీరు మారదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ నేతలు పలువురు. ఈ వైఖరి తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తిని అంతకంతకూ పెంచేస్తోంది. పేరుకు తమ ప్రభుత్వమే ఉన్నప్పటికి.. రాజకీయ ప్రత్యర్థుల పనులు మాత్రమే జరుగుతున్నట్లుగా తెలుగుదేశం ద్వితీయశ్రేణి నేతలు.. కార్యకర్తలు భావిస్తున్నారు. ఆ వాదనకు బలం చేకూరేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

గత ప్రభుత్వంలో తమ పని తీరుతో వివాదాస్పదంగా ఉన్న పలువురు అధికారులు ఇప్పటికి కంటిన్యూ కావటం.. కొందరిని కీలక స్థానాల్లో నియమించటం.. అప్పట్లో నిబంధనల్ని పట్టించుకోకుండా తమ ఎజెండాకు తగ్గట్లు వ్యవహరించిన పోలీసు అధికారులకు ముఖ్యమైన స్థానాల్లో పోస్టింగులు ఇవ్వటం తరచూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇది సరిపోదన్నట్లుగా కొందరు నేతల వైఖని వివాదాస్పదంగా ఉండటమేకాదు.. ప్రభుత్వంలో ఎవరున్నా.. తాము చెప్పిందే నడుస్తుందన్నట్లుగా వారి తీరు ఉండటం గమనార్హం. ఈ తరహా వాదనకు బలం చేకూరేలా సంఘటన గుంటూరులోచోటు చేసుకుంది.

జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు బంధువు ఒకరు బరితెగించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీక్రిష్ణ గుంటూరులో గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్ ను నిర్మించారు. పేరులో గ్రీన్ ఉంది తప్పించి.. ఈ కట్టడానికి గుంటూరు నగరపాలక సంస్థ.. రైల్వే.. కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ విషయాన్ని గుర్తించిన గుంటూరు కార్పొరేషన్ అధికారులు భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని పేర్కొంటూ స్టాప్ ఆర్డర్ ను ఇష్యూ చేసింది.

ఈ భవన నిర్మాణంపై నగర కార్పొరేషన్ తో పాటు కాలుష్య మండలి.. రైల్వే శాఖ సైతం తాము ఇచ్చిన ఎన్వోసీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అంబటి మురళి హైకోర్టును ఆశ్రయించి.. జీఎంసీ షోకాజ్ నోటీసుపైన కోర్టులో పిటిషన్ దాఖలు చేవారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తొందరపాటు చర్యలు వద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించారు. అయితే.. గుట్టుచప్పుడు కాకుండా ఒక బ్లాక్ లో ప్లాట నిర్మాణం పూర్తి చేసి.. తాజాగా గృహప్రవేశం పూర్తి చేయటం సంచలనంగా మారింది. పలు ప్రభుత్వ సంస్థల ఉత్తర్వుల్ని ధిక్కరించి మరీ గృహప్రవేశం ఎలా చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News