టూర్లు ఓకే...అసెంబ్లీలోనూ జోరు కావాలి !
ఇక్కడ చూస్తే జగన్ కి అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర అన్నది కొత్త కాదు, ఆయన 2014 నుంచి 2019 మధ్యలో ఆ పాత్రను ఆయన సక్సెస్ ఫుల్ గా పోషించారు.
వైసీపీ అధినేత జగన్ ఈ మధ్యన వరస టూర్లు చేశారు. ఆయా విజయవాడ, గుంటూరు శ్రీకాకుళం జిల్లాలలో వరస పర్యటనలు చేస్తే మంచి స్పందన లభించింది. జనాలు జగన్ కి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. దాంతో వైసీపీ అధినాయకత్వం లో పూర్తి సంతృప్తి వ్యక్తం అయింది. ఇక నిరాశలో నిండా మునిగిన వైసీపీ శ్రేణులు కూడా జగన్ బయట కాలు పెట్టి జనంలోకి రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ని పార్టీ జనాలతో పాటు బయట జనాలూ కోరుకుంటున్నాయి.
శాసనసభలో జగన్ కి ఉన్న సంఖ్యా బలం 11 మాత్రమే. అయితే ఇక్కడ నంబర్ తో పనేముంది జగన్ ఒక్కరు ఉన్నా ఆయనే కదా కేంద్ర బిందువు అవుతారు అని అంటున్న వారూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూంటే అటెన్షన్ కూడా ఉంటుంది అని అంటున్నారు.
ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని అసెంబ్లీలో జగన్ నిలదీస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని అంటున్నారు. ఇక్కడ చూస్తే జగన్ కి అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర అన్నది కొత్త కాదు, ఆయన 2014 నుంచి 2019 మధ్యలో ఆ పాత్రను ఆయన సక్సెస్ ఫుల్ గా పోషించారు.
మళ్ళీ ఇపుడు అదే పాత్రలోకి ఆయన వెళ్ళాలని జనాలు కోరుతూ తీర్పు ఇచ్చారు. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా చాలానే ఉంది అని అంటున్నారు. ఆనాడు 67 మంది ఎమ్మెల్యేలతో జగన్ బలమైన ప్రతిపక్షంగా ఉండేవారు. దాంతో పాటు ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున గెలిపించుకునే బలం కూడా ఉంది.
ఆనాడు ఎంతో మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉండేవారు. వారంతా అసెంబ్లీలో జగన్ కి బాసటగా నిలిచేవారు. దాంతో జగన్ అధికార పక్షంగా ఉన్న టీడీపీని ధాటీగా విమర్శించేవారు. ఇక విపక్ష నేత హోదాతో ఆయన తన నేరుగా బాణాలను వేసేవారు.
విపక్ష హోదా అంటే మైకు అడితే ఇస్తారు. దాంతో పాటు సీఎం మాట్లాడిన ప్రతీసారి విపక్ష నేత కూడా మైకు కోరి తమ సందేహాలను చెప్పవచ్చు. అలాగే విమర్శలు చేయవచ్చు. అలా చాలా ప్రివిలేజెస్ ఉన్నాయి. అయితే ఇపుడు జగన్ ని సాధరణ సభ్యుడిగానే చూస్తారు. ఆయనకు మైక్ ఇచ్చే సమయం కూడా పరిమితంగా ఉంటుంది.
పైపెచ్చు కూటమి ప్రభుత్వం 164 మందితో అసెంబ్లీ అంతా పరచుకుని ఉంది. దాంతో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే గతంలో మాదిరిగా కష్టమే అని అంటున్నారు. అయితే జగన్ రాజకీయంగా వ్యూహాత్మకంగా ఆలోచన చేయాలని అసెంబ్లీకి వెళ్తే ఆయనకు ప్రజలలో మరింతగా ఆదరణ పెరుగుతుందని కూటమి ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎండగట్టే సరైన వేదికగా శాసనసభ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ అసెంబ్లీకి రావడమే మేలు ఆయన తప్పక వచ్చి తీరాలని జనంలో అయితే డిమాండ్ ఉంది. మరి జగన్ ఏమి ఆలోచిస్తారో చూడాల్సి ఉంది అంటున్నారు.