ఏపీకి కేంద్రం ఇచ్చింది జీరో బడ్జెట్ నా ?

జీరో బడ్జెట్ అంటే సున్నా కేటాయింపులు అని ఇక్కడ అర్ధం చేసుకోవాలి. ఈ విమర్శ చేసింది వైసీపీ.

Update: 2024-07-23 19:37 GMT

జీరో బడ్జెట్ అంటే సున్నా కేటాయింపులు అని ఇక్కడ అర్ధం చేసుకోవాలి. ఈ విమర్శ చేసింది వైసీపీ. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం కేంద్ర బడ్జెట్ మీద ఘాటుగా స్పందించింది. కేంద్రం ఏపీకి ఏమీ ఇవ్వలేదని ఇచ్చినట్లుగా టీడీపీ కూటమి ప్రచారం చేస్తూ సంబరాలకు తెర తీస్తోందని అంటోంది.

అమరావతి రాజధానికి 15 వేల కోట్లు గ్రాంట్ గా ఇచ్చినట్లుగా చెబుతున్నారు కానీ అది గ్రాంట్ కాదని అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం దగ్గరుండి ష్యూరిటీనే ఇస్తోందని వైసీపీ అంటోంది. అయితే టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఇదేదో ఘన కార్యమని టీడీపీ కూటమి సాధించిన విజయం అని ప్రచారం చేస్తోందని వైసీపీ తప్పు పడుతోంది.

మొదట కేంద్రం ఉదారంగా అమరావతికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినట్లుగా ప్రచారం సాగడంతో సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు ఆ తరువాత మాత్రం అసలు విషయం బయటపడడంతో తేలు కుట్టిన దొంగల మాదిరిగా గమ్మున్న ఉన్నారని ఎక్స్ లో వైసీపీ విమర్శలు చేసింది. బడ్జెట్ లో పోలవరం గురించిన క్లారిటీ లేదని విభజన హామీల ప్రస్థావన లేనే లేదని కూడా పేర్కొంది.

మొత్తం మీద చూస్తే ఏపీలో ఎండీయే సర్కార్ ఉంది. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఉంది. డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు అభివృద్ధి పరుగులు పెడుతుంది అని చెప్పిన వారు అంతా ఇపుడు అప్పులలో పరుగులు పెడుతోంది అని అంటున్నారు. అప్పులు తెచ్చుకుని గొప్పలు పోవడమేంటని కూడా అంటున్నారు. ఏపీ రాజధానిని కేంద్రమే నిర్మించాలని గట్టిగా ఎందుకు టీడీపీ నిలదీయదని కూడా ప్రశ్నిస్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎండీయేకు మద్దతు ఇస్తూ ఆ ప్రభుత్వం స్థాపనలో కీలక భాగమైన టీడీపీ ఏపీ కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇపుడు కాకపోతే మరెప్పుడు నిలదీస్తుందని కూడా ప్రశ్నిస్తున్నారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏపీకి ఏమి సాధించిందో ప్రజలకు చెప్పాలని కూడా వైసీపీ డిమాండ్ చేస్తోంది.

Tags:    

Similar News