రేసులోకి వైవీ సుబ్బారెడ్డి : ఒంగోలు ఎంపీ సీటు కోసం బిగ్ ఫైట్...!?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో తాను పోటీకి రెడీ అని సంకేతాలు ఇచ్చేశారు. అయితే ఆయన ఒంగోలు పార్లమెంట్ పేరు ఎత్తలేదు.

Update: 2023-11-14 11:16 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్. సీనియర్ రాజకీయ నేత వైవీ సుబ్బారెడ్డి మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో వెలగాలని చూస్తున్నారు. ఆయన 2014లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి వైసీపీ తరఫున విజయబావుటా ఎగరేశారు. ఇక 2019లో మాత్రం ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ ప్లెస్ లో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి వైసీపీ అధినాయకత్వం టికెట్ ని కన్ ఫర్మ్ చేసింది.

ఆయన కూడా మంచి మెజారిటీతో గెలిచారు. 2024 ఎన్నికల్లో మరోసారి సిట్టింగ్ ఎంపీ మాగుంట పోటీ చేస్తారని ప్రచారం ఒక వైపు సాగుతోంది. అలాగే ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. సండెన్ గా నేనూ ఉన్నాను అని వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ ఇచ్చేశారు.

ఆయన లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు అయితే సంచలనం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో తాను పోటీకి రెడీ అని సంకేతాలు ఇచ్చేశారు. అయితే ఆయన ఒంగోలు పార్లమెంట్ పేరు ఎత్తలేదు. సీఎం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించారు.

దాంతో ఆయన పోటీ చేసేది ఎక్కడ నుంచి అన్న చర్చ అయితే మొదలైంది. ఒంగోలు వైవీ సొంత జిల్లా. ఆయన అక్కడ ఒక మారు గెలిచి ఉన్నారు. దాంతో ఆయన చూపు అక్కడే ఉందని అంటున్నారు. దాంతో ఎక్కడ నుంచి అయినా అన్న సస్పెన్స్ ని వైవీ సుబ్బారెడ్డి పెట్టినా కూడా ఫోకస్ అంతా ఒంగోలు మీదనే ఉంది అని అంటున్నారు.

అక్కడే ఆయనకు పట్టు ఉంది. రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఆయన మళ్లీ పోటీ చేసి గెలిచి ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టాలని చూస్తున్నారు. 2019 తరువాత వైవీ సుబ్బారెడ్డిని ఏకంగా నాలుగేళ్ల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా జగన్ ప్రభుత్వం నియమించింది. ప్రతిష్టాత్మకమైన ఈ పదవిలో ఆయన ఎక్కువ కాలమే కొనసాగారు.

ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉంటున్నారు. మూడు జిల్లాలలో పార్టీని గెలిపించే బాధ్యతను జగన్ ఆయనకు అప్పగించారు. కీలకమైన ఎన్నికల సమయంలో వైవీ విశాఖలో మకాం వేసి పార్టీని యుద్ధానికి సిద్ధం చేయాల్సి ఉంది.

ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ అంటే ఇప్పటి నుంచే అక్కడికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్రా జిల్లాలు వైసీపీకి చాలా ముఖ్యం. అందువల్ల వైవీ సుబ్బారెడ్డిని పోటీకి అనుమతిస్తారా అన్న చర్చ కూడా ఉంది. అయితే సీఎం ఆదేశాలతో అని వైవీ అనడంతోనే ఇపుడు కొత్త చర్చ మొదలైంది. అదే నిజం అయితే ఒంగోలు ఎంపీ సీటు కోసం వైసీపీలో బిగ్ ఫైట్ తప్పేట్లు లేదని అంటున్నారు.

Tags:    

Similar News