ఒక్కడే.. ఏడాదిలో 1377 రెస్టారెంట్లలో ఆర్డర్ పెట్టాడట
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన వార్షిక రిపోర్టును విడుదల చేసింది. అందులో ఇద్దరు కస్టమర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఏడాది చివరకు వచ్చేసింది. మరో మూడు రోజుల తర్వాత కొత్త సంవత్సరం వచ్చేయనుంది. దీంతో.. ఈ ఏడాది మొత్తం జరిగిన విశేషాలతో పలు సంస్థలు వార్షిక భేటీలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు చెప్పేది ఆ కోవలోకే వస్తుంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన వార్షిక రిపోర్టును విడుదల చేసింది. అందులో ఇద్దరు కస్టమర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీనికి కారణం.. వారిద్దరు రోటీన్ కు భిన్నంగా ఆర్డర్లు ఇవ్వటమే. వీరిద్దరి గురించి తెలిసిన తర్వాత మాత్రం.. ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. అంత భిన్నంగా వీరి ఆర్డర్లు ఉండటమే దీనికి కారణం.
ఒక వ్యక్తి ఏడాది మొత్తంలో 1377 వేర్వేరు రెస్టారెంట్లలో ఫుడ్ ను ఆర్డర్ చేశాడట. అంటే.. రోజుకు నాలుగు వేర్వేరు రెస్టారెంట్లలో ఫుడ్ ను ట్రై చేసినట్లుగా చెప్పాలి. ఈ ఫుడీ ఎక్కడి వాడు? అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. రైళ్లలో ఫుడ్ డెలివరీకి సంబంధించి జొమాటో - ఐఆర్ సీటీసీ మధ్య కుదిరిన ఒప్పందం తెలిసిందే. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్న ఒకరు చేసిన భారీ ఆర్డర్ ను తన వార్షిక నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. అందులో ఒక వ్యక్తి మంచూరియా కాంబో ప్లేట్స్ ఆర్డర్ పెట్టాడట. అదెంత భారీ అంటే.. తాను ప్రయాణిస్తున్న మొత్తం బోగీకి పంచి పెట్టాడట.
అయితే.. ఆ వ్యక్తి ఎవరు? ఏ తేదీన ఆర్డర్ బుక్ చేశాడు? ఎక్కడ ఈ ఆర్డర్ బుక్ చేశాడు? అన్న వివరాల్ని వెల్లడించలేదు. జొమాటో కు చెందిన క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ కు సంబంధించిన డేటాను తన వార్షిక రిపోర్టులో పొందుపరుస్తూ విడుదల చేశారు. బ్లింకిట్ ద్వారా దేశ వ్యాప్తంగా 1.7 లక్షల మ్యాగీ పాకెట్లను డెలివరీ చేశామని.. ఏకంగా కోటి కోకాకోలా బాటిల్స్ ను డెలివరీ చేసినట్లుగా పేర్కొంది. అంతేకాదు.. ఒక వ్యక్తి ఏడాది మొత్తంలో 1203 స్ప్రైట్ బాటిళ్లనను ఆర్డర్ పెట్టినట్లుగా పేర్కొంది.
ఇక.. ఫాదర్స్ డే రోజున అత్యధికంగా టేబుళ్లు బుక్ అయినట్లుగా జొమాటో తెలిపింది. అత్యధికంగా 1.25 కోట్ల టేబుళ్లు బుక్ అయ్యాయని.. ఆ రోజును కుటుంబ సమేతంగా గడిపేందుకు 84,866 రిజర్వేషన్లు బుక్ చేసినట్లుగా పేర్కొంది. అత్యధికంగా బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి గార్డెన్ సిటీలోని ఒక రెస్టారెంట్ కు వెళ్లి ఏకంగా రూ.5.13 లక్షల బిల్ చెల్లించినట్లుగా జొమాటో తెలిపింది. డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్ ఇంత భారీగా ఉండటం ఇదే తొలిసారిగా తన నివేదికలో వెల్లడించింది.