నందిగం సురేశ్ కేసు సుప్రీం కీలక తీర్పు
బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తుళ్లూరు మండలం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ ట్రయల్ కోర్టులో బెయిల్ దక్కలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ కేసుపై విచారించిన సుప్రీం ట్రయల్ కోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో నందిగం సురేశ్ కు ఇప్పట్లో ఊరట దక్కేలా కనిపించడం లేదు.
వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో జరిగిన హత్య కేసులో నందిగం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. ఇరువర్గాల ఘర్ఘణలో మరియమ్మ అనే మహిళ మరణించారు. దీనిపై అప్పట్లోనే కేసు నమోదైనా వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఏడు నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరియమ్మ కుమారుడు ఈ హత్యపై మంత్రి లోకేశ్ కు ఫిర్యాదు చేయడంతో మళ్లీ కదలిక వచ్చింది.
టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో తొలుత మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత మరియమ్మ కేసు తెరపైకి తెచ్చి జైలులోనే ఉంచారు. అయితే ఈ కేసుపై నిందితుడు నందిగం సురేశ్ ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు బెయిల్ ఇవ్వాలని పోరాటం చేశారు. అన్ని దశల్లోనూ ఆయనకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. మరియమ్మ హత్య కేసులో నందిగం సురేశ్ తోపాటు 34 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.