ఏటూరునాగారం ఎన్ కౌంటర్... పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు!
అవును... ఏటూరునాగారం ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.
ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగిందని.. చల్పాక అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు - మావోయిస్టులు మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారని.. ఇందులో దళంలోని కీలక సభ్యులు ఉన్నారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు స్పందించింది.
అవును... ఏటూరునాగారం ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా.. పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ చేశారంటూ పౌరహక్కుల సంఘం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో... భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని అన్నారు.
అనంతరం వారిని చిత్రహింసలకు గుర్తిచేసి, కాల్చి చంపారని న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో... మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని.. కనీసం కుటుంబ సభ్యులకు కూడా చూపించకుండా మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారని కోర్టుకు వివరించారు.
ఈ విధంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్.హెచ్.ఆర్.సీ) నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని అన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తరుపు న్యాయవాది... అడవిలో పోలీసులు భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించారని న్యాయస్థానానికి తెలిపారు.
ఇదే సమయంలో... కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించామని అన్నారు. అదేవిధంగా.. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసినట్లు కోర్టుకు తెలిపారు. ఇలా ఇరువైపుల వాదనలు విన్న అనంతరం హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇందులో భాగంగా... పోస్టుమార్టం ముగిసిన తర్వాత రేపటి (డిసెంబర్ 3వ తేదీ) వరకూ మృతదేహాలను భద్రపరచాలని.. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.