లేటుగా నిద్రపోతున్నారా అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..

అవునండి మీ వయసును పట్టి మీరు నిద్ర పోవాల్సిన సమయం ఉంటుంది.. మరదేమిటో తెలుసుకుందాం పదండి..

Update: 2024-07-16 16:30 GMT

ఆహ్లాదకరమైన జీవన శైలి, సమతుల్యమైన ఆహారం శరీర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్ర కూడా మన ఆరోగ్యానికి అంతే ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. మీ వయసుకు అనుగుణంగా మీరు ఎన్ని గంటలు నిద్రపోవాలి అన్న విషయం మీకు తెలుసా? అవునండి మీ వయసును పట్టి మీరు నిద్ర పోవాల్సిన సమయం ఉంటుంది.. మరదేమిటో తెలుసుకుందాం పదండి..

నిరంతరం పనిచేసే మన శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇచ్చే ప్రక్రియ నిద్ర. మనం నిద్రపోయే ఈ సమయంలో మన శరీరంలోని వివిధ అవయవాలు తమ శక్తిని పునర్నిర్మించుకుంటాయి. అందుకే నిద్ర మన ఆరోగ్య సంరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. రాత్రిపూట సమయానికి నిద్రపోకుండా ఫోన్లో చూస్తూ మేలుకోవడం ఇప్పుడు బాగా అలవాటైపోయింది. అయితే క్రమంగా ఈ అలవాటు మీకు పలు రకాల అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది అంటున్నారు నిపుణులు.

తగినంత నిద్ర లేకపోతే టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి ఊబకాయం కూడా వస్తుంది. ఎక్కువసేపు నిద్రపోకుండా ఫోన్ చూస్తూ గడిపేవారు క్రమంగా డిప్రెషన్ లోకి వెళ్తారు అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు మేలుకోవడం ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం ట్రెండ్ గా మారుతుంది.

అయితే దీనివల్ల మీకు తెలియకుండా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి వల్ల అలసట, చికాకు, మానసిక ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం సర్వసాధారణం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు తగినంత నిద్ర అవసరం. నిద్రలేమి కారణంగా పిల్లలలో పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది.

మీరు ఎంత సేపు నిద్రపోవాలి..

వయసును పట్టి నిద్రపోయే విధానం ఉంటుంది. పసిపిల్లలు ఎక్కువ సేపు నిద్రపోతారు.. అయితే క్రమంగా పెరిగే కొద్దీ నిద్రను పొందే సామర్ధ్యం వయసుతో పాటు తగ్గుతూ వస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డ రోజుకు 11 నుంచి 14 గంటల వరకు నిద్రపోవడం అవసరం.

3 నుంచి 5 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు కనీసం 10 గంటలు పడుకోవాలి. స్కూల్ కి వెళ్లే పిల్లలు రోజుకి కనీసం 8 గంటలు కచ్చితంగా పడుకోవాలి. ఇక 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు రోజు 7 నుంచి 9 గంటల పాటు నిద్రించేలా చూసుకోవాలి. 60 సంవత్సరాలు పైబడిన వారు కనీసం 6 గంటలైనా రోజుకు నిద్రపోవాలి. ప్రతిరోజు 9 నుంచి 10 మధ్యలో నిద్రపోవడం తెల్లవారుజామున నిద్రలేయడం మీ దినచర్యలో భాగంగా చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Tags:    

Similar News