చిన్నమ్మకు స్పీకర్ దక్కనిది అందుకే.. పెద్ద కారణమే

సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోవడమే కాదు.. ప్రతిపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి మెరుగైన సీట్లు దక్కాయి.

Update: 2024-06-29 23:30 GMT

గత రెండు పర్యాయాలు సొంతంగా మెజారిటీ సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి ఈసారి ఎన్నికలు మాత్రం చుక్కలు చూపించాయి. సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోవడమే కాదు.. ప్రతిపక్ష కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి మెరుగైన సీట్లు దక్కాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోక్ సభ స్పీకర్ పదవి అత్యంత కీలకం.

సంఘ్/బీజేపీ నేపథ్యం ఉంటేనే..

బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వంలో కీలక పదవులు దక్కాలంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేపథ్యం ఓ పెద్ద అర్హత. గవర్నర్ వంటి పదవులు సంఘీయులకే దక్కుతాయి. అలాంటిది కీలకమైన పరిస్థితుల్లో లోక్ సభ స్పీకర్ అంటే.. మరో చాన్స్ ఉండదు. కాగా, ఇటీవల స్పీకర్ గా మరోసారి ఓం బిర్లాకే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పదవి ఎవరికి దక్కుతుందోనని కొద్ది రోజుల పాటు సస్పెన్స్ నెలకొంది. ఓ దశలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేరు ప్రముఖంగా వినిపించింది.

టీడీపీ.. బీజేపీ వయా కాంగ్రెస్

పురంధేశ్వరి దివంగత మహా నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ కుమార్తె. ఆమెది టీడీపీ నేపథ్యం. అయితే, తన తండ్రిని పదవీచ్యుతుడిని చేశాక.. చంద్రబాబు నాయుడతో విభేదాల రీత్యా ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరారు. 2014 వరకు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఏపీ విభజనతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇదే నేపథ్యం పురంధేశ్వరికి బీజేపీలో మరింత ఉన్నత పదవులు దక్కేందుకు అడ్డంకిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పార్టీలో పదవుల వరకే?

పురంధేశ్వరికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, బీజేపీ మహిళా మోర్చా పదవులు ఇచ్చినా.. పదేళ్ల నుంచి ప్రభుత్వంలో పదవులు మాత్రం దక్కలేదు. ఇటీవలి ఎన్నికల్లో ఆమె రాజమహేంద్రవరం నుంచి ఎంపీగానూ గెలిచారు. కేంద్ర కేబినెట్ లోనూ చోటివ్వలేదు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవిని బీజేపీ మిత్రపక్షానికి కేటాయించే ఆలోచన ఉంది. మరి పురంధేశ్వరిని పార్టీ బాధ్యతల్లోనే కొనసాగిస్తారా? లేక మున్ముందు కేబినెట్ లో చోటిస్తారా? అనేది చూడాలి.

Tags:    

Similar News