జైళ్లలో అంటరానితమా: సుప్రీం కోర్టు సీరియస్
జైళ్లలోనూ కులాల ప్రాతిపదికన బ్రారెక్‌లు కేటాయించడం.. కులాల ప్రాతిపదికన పనులు చేయించడం ఏంటని సుప్రీంకోర్టు నిలదీసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సాధారణ జైళ్లలోనూ దారుణమైన పరిస్థితి నెలకొందని సుప్రీంకోర్టు తేల్చి చె ప్పింది. ముఖ్యంగా అంటరానితనం విచ్చలవిడిగా సాగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్లలో పరిస్థితులను చక్కదిద్దాలని.. విచారణ ఖైదీలు సహా.. శిక్ష పడిన వారికి మానవ హక్కులు కల్పించాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ సందర్భంగా కీలకమైన జైళ్ల మాన్యువల్‌లో `కులం` అనే కాలమ్‌ను రద్దు చేసింది.
జైళ్లలోనూ కులాల ప్రాతిపదికన బ్రారెక్‌లు కేటాయించడం.. కులాల ప్రాతిపదికన పనులు చేయించడం ఏంటని సుప్రీంకోర్టు నిలదీసింది. ఇది మానవహక్కులను ఉల్లంఘించడంతోపాటు.. అంటరాని తనాన్ని ప్రోత్సహించడమేనని తేల్చి చెప్పింది. ``ఖైదీల కులం ఏంటో తెలుసుకుని ఆ కులాల ప్రాతిపదికన కొందరితో మరుగుదొడ్లు కడిగిస్తున్నారు. మరికొందరితో స్కావెంజ్ పనులు చేయిస్తున్నారు. అగ్ర వర్ణాల వారితో మాత్రం వంటలు చేయిస్తున్నారు. ఇది కుల వివక్ష కాదా? అంటరాని తనం కాదా?`` అని సుప్రీం కోర్టు నిలదీసింది.
అంటరానితనాన్ని నిర్మూలించాలన్న జాతి నేతల ఔచిత్యం,.. రాజ్యాంగ బద్ధమైన హక్కులు ఏమై పోయా యని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. దీనికి కారణమైన జైళ్ల మాన్యువల్‌లోని `కులం` కాలమ్‌ను రద్దు చేస్తున్న ట్టు తెలిపింది. ఇక నుంచి ఖైదీలను వారు చేసిన నేరాల ప్రాతిపదికనే ట్రీట్ చేయాలని తేల్చి చెప్పింది. కులాల ప్రాతిపదికన కాదని పేర్కొంది. కులాల ప్రాతిపదికన ఖైదీలకు బ్యారెక్‌లు కేటాయించడాన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
``ఇలా కులాల ప్రాతిపదికన ఖైదీలను వేరు చేసే అధికారం ఎవరు ఇచ్చారు? ఎలా వచ్చింది? అందరూ సమానులేనని రాజ్యాంగం ఘోషిస్తుంటే.. కొందరిని ఒక విధంగా మరికొందరిని మరో విధంగా ఎలా చూస్తారు? కులాల ప్రాతిపదికన ఖైదీలను వేరు చేయడం ద్వారా వారిలో మార్పు రాదు. వారికి కూడా స్వాభిమానం ఉంటుంది. దానిని అందరూ తప్పక గౌరవించాల్సిందే. ఈ విషయంలో దేశ వ్యాప్తంగా అమలయ్యేలా ఒక నిర్ణయం ప్రకటిస్తాం`` అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.