సుప్రీం త‌డాఖా: జంపింగుల‌కు నోటీసులు!

తెలంగాణలో రాజ‌కీయాలు వేడెక్కాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు తాజాగా అసెంబ్లీ కార్య‌ద‌ర్శి నోటీసులు జారీ చేశారు.

Update: 2025-02-04 09:04 GMT

తెలంగాణలో రాజ‌కీయాలు వేడెక్కాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు తాజాగా అసెంబ్లీ కార్య‌ద‌ర్శి నోటీసులు జారీ చేశారు. మొత్తం 10 మంది శాస‌న స‌భ్యుల‌కు నోటీసులు జారీ చేస్తూ.. అసెంబ్లీ కార్య‌ద‌ర్శి నిర్ణ‌యం తీసుకున్నారు. ``ఎందుకు పార్టీ మారారు? ఆ అవ‌స‌రం ఏమొచ్చింది? ఈ క్ర‌మంలో మీపై ఏమైనా వ‌త్తిళ్లు ఉన్నాయా? ప్ర‌లోభ పెట్టారా?`` అంటూ.. సద‌రు నోటీసుల్లో పేర్కొన‌డం మ‌రింత ఆశ్చ‌ర్యంగా ఉంది. పార్టీ ఫిరాయించ‌డానికి గ‌ల కార‌ణాలు.. పేర్కొంటూ త‌గిన స‌మాధానం చెప్పాల‌ని కోరారు.

దీంతో ఆయా ఎమ్మెల్యేలు ఇప్పుడు పెద్ద చిక్కుల్లో ప‌డ్డారు. వారు చెప్పే రీజ‌న్ల‌తో ప‌నిలేకుండా.. స్పీక‌ర్ త‌గిన నిర్ణ‌యం తీసుకునేందుకు అవ‌కాశం ఉంది. అయితే.. రాజ‌కీయంగా ప‌లు రాష్ట్రాల్లో ఇలాంటి ప‌రిణామాలే జ‌రుగుతున్నందున స్పీక‌ర్లు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ, మ‌హారాష్ట్ర ఉదంతం త‌ర్వాత‌.. తెర‌మీదికి వ‌చ్చిన తెలంగాణ‌.. విష‌యంపై సుప్రీంకోర్టు ఇటీవ‌ల సీరియ‌స్ కామెంట్లు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విష‌యంలో స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునేందుకు.. ఇంకెంత స‌మ‌యం పడుతుంద‌ని ప్ర‌శ్నించింది.

మ‌హారాష్ట్ర స్పీక‌ర్ మాదిరిగా చేయాల‌ని అనుకుంటున్నారా? అని కూడా సుప్రీంకోర్టు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో తాజాగా స‌భ ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే కార్య‌ద‌ర్శి ఆయా జంపింగుల‌కు నోటీసులు జారీ చేశారు. మొత్తం ప‌ది మంది ఎమ్మెల్యేలు.. ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విష‌యం తెలిసిందే. వీరిలో దానం నాగేంద‌ర్ వంటి సీనియ‌ర్లు కూడా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో బీఆర్ ఎస్ వారిపై చ‌ట్ట ప్ర‌కారం వేటు వేయాల‌ని కోరుతోంది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీక‌ర్ ప్ర‌సాద‌రావుకు ఆరు మాసాల కింద‌టే బీఆర్ ఎస్ ఫిర్యాదు చేసింది. అయినా.. ఆయ‌న ఎలాంటి నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌డం తొలుత హైకోర్టు.. త‌ర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్‌ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. స్పీక‌ర్‌ను త‌ప్పుప‌డుతూ.. కోర్టు వ్యాఖ్య‌లు చేసింది.

Tags:    

Similar News