ప్రజలకు సారీ చెప్పిన స్టార్ క్రికెటర్!

ఆనాడు అల్లర్ల సమయంలో స్పందించకుండా మౌనంగా ఉన్నానని, అందుకు బంగ్లాదేశ్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

Update: 2024-10-11 03:30 GMT

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల కారణంగా మొదలైన అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో ప్రధాని షేక్‌ హసీనా పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం చెలరేగిన మత ఘర్షణల నేపథ్యంలో 300 మందికిపైగా చనిపోయారు. ఆ సమయంలో వేలాదిమంది దేశం విడిచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం విడిచి వెళ్లారు. అయితే, ఆ సమయంలో జరిగిన గొడవలపై బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు అల్లర్ల సమయంలో స్పందించకుండా మౌనంగా ఉన్నానని, అందుకు బంగ్లాదేశ్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

అవామీ లీగ్ నేతృత్వంలోని ప్రభుత్వ పతనానికి దారితీసిన నిరసనలపై మౌనంగా ఉన్నందుకు క్షమించాలని కోరారు. బంగ్లాదేశ్ పార్లమెంటు సభ్యుడు అయిన షకీబ్...ఆ రాజకీయ సంక్షోభంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. అంతేకాదు, ఈ నెల 21న తాను చివరి అంతర్జాతీయ మ్యాచ్ ను సొంతగడ్డపై ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఆడాలనుకుంటున్నానని, ఆ మ్యాచ్ కు వచ్చి తనకు మద్దతుగా నిలవాలని కోరారు. అక్టోబర్ 21 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న 2 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో షకీబ్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారు.

ఆ గొడవల్లో చనిపోయిన వారిని స్మరించుకుంటున్నానని, ఏ త్యాగం చేసిన నష్టాన్ని పూర్తిగా పూడ్చలేమని అన్నారు. ఆ క్లిష్ట సమయంలో తన మౌనం వల్ల బాధపడ్డ లేదా నిరాశకు గురైన వారి భావాలను అర్ధం చేసుకున్నానని, ఆ నిరసనలపై స్పందించనందుకు, మౌనంగా ఉన్నందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. తాను వారి స్థానంలో ఉంటే, అలాగే భావించి ఉండేవాడినని షకీబ్ అన్నారు.

రాబోయే టెస్ట్ మ్యాచ్ తన చివరి మ్యాచ్ అని, తన మద్దతుదారులు, బంగ్లా ప్రజల మధ్య టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు చెప్పాలనుకుంటున్నానని అన్నారు. మరి, షకీబ్ పిలుపుతో ప్రేక్షకులు స్టేడియానికి వస్తారా రారా అన్నది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News