విషాదం.. అగ్నిప్రమాదానికి ఎన్నారై కుటుంబం బలి!
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పిన అనంతరం ఫస్ట్ ఫ్లోర్‌లో ఐదు మృతదేహాలను గుర్తించారు.
బ్రిటన్ లో విషాదం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ రాజధాని లండన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో భారత సంతతికి చెందిన కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉండటం అందరినీ ఆవేదనకు గురి చేసింది.
ఇంగ్లండ్ కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రి ఎన్నారై కుటుంబం దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఆ తర్వాత కాసేపటికే అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పిన అనంతరం ఫస్ట్ ఫ్లోర్‌లో ఐదు మృతదేహాలను గుర్తించారు.
కాగా, మాంచెస్టర్ కు చెందిన దిలీప్ సింగ్(54) మాట్లాడుతూ.. అది తన బావమరిది ఇల్లు అని వెల్లడించారు. అందులో ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటున్నారని తెలిపారు. అగ్నిప్రమాద ఘటన సమయంలో మరో ఇద్దరు అతిథులు కూడా ఉన్నట్లు తెలిపారు. కాగా ఆ కుటుంబం ఇటీవలే బెల్జియం నుంచి లండన్ లోని కొత్త ఇంటికి మకాం మార్చినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ప్రాణాపాయం లేదని చెబుతున్నారు. మరో వ్యక్తిని ఇంకా పోలీసులు గుర్తించాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చే సమయానికి మరో వ్యక్తి ఆ ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలుస్తోంది.
అగ్నిప్రమాదం ఎలా సంభవించిందో తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తూ జరిగిందా లేక, బాణసంచా అంటుకోవడం వల్ల జరిగిందా అనే దానిపై విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అగ్నిమాపక శాఖ అధికారులు అన్ని దశల్లో దీనిపై విచారణ నిర్వహిస్తున్నారని తెలిపారు.
ముందుజాగ్రత్తగా చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఖాళీ చేయించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ సాగుతోందని.. ఈ ప్రారంభ దశలో ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.