11 గంటలు సాగిన కృష్ణా యాజమాన్య బోర్డు భేటీలో ఏం జరిగింది?

Update: 2021-09-02 08:30 GMT
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కృష్ణా యాజమాన్య బోర్డు భేటీ బుధవారం జరిగింది. ఈ భేటీకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తంగా పదకొండు గంటల పాటు ఈ భేటీ రెండు భాగాలుగా సాగింది. మొదటి భేటీ ఏడు గంటల పాటు సాగింది. ఇందులో రెండు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. తర్వాత బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అంశాల అమలుపై మరో నాలుగు గంటల పాటు సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు మొదలైన ఈ భేటీ సుదీర్ఘంగా సాగింది. ఇటీవల కృష్ణా జలాల పంపిణీ విషయంలోనూ.. విద్యుత్ ఉత్పత్తి మీద రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇలాంటివేళ.. జరుగుతున్న బోర్డు సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి ఈ ఏడాది వరకు కృష్ణా జలాల్ని పాత పద్దతిలోనే పంచుకోవాలని నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టులో చేరే నీటిని తెలంగాణ 34 శాతం.. ఏపీ 66 శాతం పంచుకోనుంది. ఇటీవల కాలంలో కృష్ణా జలాల్ని ఫిఫ్టీ.. ఫిఫ్టీ అంటూ కొత్త వాదనను తెలంగాణ తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల జలవనరుల శాఖల కార్యదర్శకులు.. కీలక అధికారులు హాజరయ్యారు.

తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో కృష్ణా జలాల్లో వాటాను ట్రిబ్యునళ్లు మాత్రమే తేలుస్తాయని.. తాము నిర్ణయం తీసుకోలేమని బోర్డు తేల్చింది. దీంతో.. తెలంగాణ పాత పద్దతిని ఈసారికి కొనసాగించేందుకు ఓకే చెప్పింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవల కాలంలో శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాగు.. సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ కోరితే.. తెలంగాణ మాత్రం విద్యుత్ ఉత్పత్తికే తాము ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది.

నీటి వాటాలపై తెలంగాణ వాదన

-  కృష్ణాబోర్డు 12వ భేటీలో తెలంగాణ, ఏపీ మధ్య 34:66 నిష్పత్తిలో ఒక ఏడాదికి నీటి పంపకాలు చేయడానికి అంగీకరించాం. మైనర్‌ ఇరిగేషన్‌ వినియోగం, పట్టిసీమ నుంచి కృష్ణాడెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లు, ఆవిరి నష్టాలను ఈ నిష్పత్తిలో లెక్కించకూడదని నిర్ణయం తీసుకున్నాం.

-  పరీవాహకం, సాగుయోగ్య భూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభా ఆధారంగా చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీల వాటా 70.8, 29.2 శాతంగా ఉండాలి. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తీర్పు అమల్లోకి వచ్చేవరకు కృష్ణా జలాల్లో లభ్యత నీటిని 50ః50 నిష్పత్తిన పంచాలి.

ఏపీ వాదన

-  పోలవరం మళ్లింపు వాటాల ప్రకారం సైతం తమకు 45 టీఎంసీలు అదనంగా దక్కుతాయని, వాటిని ఈ ఏడాది నుంచి వినియోగిస్తామని తెలంగాణ అధికారులు తెలుపగా.. అందుకు ఏపీ వ్యతిరేకించింది.

-  కృష్ణాడెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు సంబంధించి.. నాగార్జునసాగర్‌ ఎగువన నీటిని పంపిణీ చేసే అధికారం బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కే ఉందని ఏపీ సెక్రటరీ శ్యామలారావు వాదించారు. ప్రస్తుత వాటాలను సవరిస్తే ఏపీకే 70 శాతం నీటిని ఇవ్వాల్సి ఉంటుంది.

ఇలా రెండు రాష్ట్రాల ప్రతినిధులు తమ వాదనల్ని బలంగా వినిపించారు. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకున్న బోర్డు సభ్యులు నీటి వాటాల అంశం బోర్డులు తేల్చే పని కాదని.. ట్రిబ్యునల్ లో విషయం తేలే వరకు పాత విధానాన్ని అనుసరించి నీటిని వాడుకోవాలని బోర్డుచెప్పగా అందుకు తెలంగాణ ఓకే చెప్పింది. ఇదిలా ఉంటే తెలంగాణ మరో ఆసక్తికర వాదనను తెర మీదకు తీసుకొచ్చింది.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఒక ఏడాది వాడుకోలేకపోయిన నీటిని తర్వాతి ఏడాదిలో వాడుకునేలా తమకు అనుమతి ఇవ్వాలన్న తెలంగాణ ప్రతిపాదనను కృష్ణాబోర్డు తోసిపుచ్చింది. ఈ విషయంలో తెలంగాణ వాదనను ఏపీ తప్పు పట్టింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ క్లాజ్‌–8 ప్రకారం ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయని స్పష్టం చేశారు.అదే సమయంలో భేసిన్ లోని ప్రాజెక్టులన్ని నిండి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద జలాల్ని ఎవరు వాడుకున్నా వాటాల్లో పరిగణించకూడదని ఏపీ కోరగా.. బోర్డు ఓకే చెప్పింది. అదే సమయంలో తెలంగాణ వినతి మేరకు.. ఎవరెవరు ఎంతమేర వరద జలాల్ని వాడుతున్నారో లెక్కలు చెప్పాలన్న సూచనకు అంగీకారం తెలిపింది.

జలాల పంపిణీపై జరిగిన వాదనలకు భిన్నంగా శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై సమావేశం మాత్రం వాడివేడిగా సాగింది. శ్రీశైలంలో ఇష్టారీతిగా విద్యుదుత్పత్తి చేస్తున్నారని, దానిని తక్షణమే నిలిపేయాలని ఏపీ డిమాండ్‌ చేయగా.. అనుమతుల్లేని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణాజలాలను తరలించడం ఆపాలని తెలంగాణ వాదించింది. ఇలా ఇరు వర్గాల వారు తమ వాదనల్ని బలంగా వినిపించారు. ఈ సందర్భంగా శ్రీశైలం పూర్తిగా విద్యుదుత్పత్తి ప్రాజెక్టు అని తెలంగాణ తరఫున రజత్ కుమార్ స్పష్టం చేస్తే.. ప్రాజెక్టు ప్రోటోకాల్ ప్రకారం తాగు.. సాగు అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని.. ఆ అవసరాలు లేనప్పుడే శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేయాలని ఏపీ వాదనలు వినిపించింది.

విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయడం ఏమిటని ఏపీ ప్రశ్నించింది. ఈ ఏడాది ఏకంగా 100 టీఎంసీల నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేశారని పేర్కొంది. దీనిపై బోర్డు ఛైర్మన్ స్పందిస్తూ.. తాగు.. సాగు అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్న సూచన చేసింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరం ఎక్కువగా ఉందని స్పష్టం చేయగా.. తమ సూచనలు పాటించాలని బోర్డు కోరటంతో తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనంతరం విద్యుదుత్పత్తిని ఆపే ప్రసక్తే లేదని రజత్ కుమార్ స్పష్టం చేయటం గమనార్హం.
Tags:    

Similar News