వీసాల కోసం ఎగబడ్డ జనం.. తొక్కిసలాట, 15 మంది మృతి !

Update: 2020-10-22 15:10 GMT
అఫ్గనిస్థాన్ ‌లో పాకిస్థాన్ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన 15 మందిలో , 11 మంది మహిళలే ఉండటం బాధాకరం. అలాగే మరికొంత మంది తీవ్ర గాయాల పాలైయ్యారు. ప్రతి ఏడాది పాకిస్థాన్‌ జారీ చేసే వీసాలకు ‌అఫ్గనిస్థాన్ లో భారీ డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నిర్వహించిన వీసా మేళాకు సుమారు 3వేలమంది అఫ్ఘాన్లు హాజరయ్యారు. వీసా జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో జనాల్లో పెరిగిన అసహనం, దరఖాస్తుల కోసం టోకెన్లు తీసుకునే క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు.

జలాలాబాద్ ప్రావిన్సుల కౌన్సిల్ సభ్యుడు సోహ్రాబ్ ఖాద్రీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ వీసా కోసం 3 వేల మందికిపైగా పౌరులు హాజరయ్యారని తెలిపారు. జనం భారీ సంఖ్యలో తరలిరావడంతో వారిని అదుపుచేయడంలో భద్రత సిబ్బంది విఫలమయ్యారని అన్నారు. దీంతో అదుపుతప్పి తొక్కిసలాట చోటుచేసుకుందని, పాకిస్థాన్ వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు పొందడానికి టోకెన్లు తీసుకునేందుకు ఎగబడ్డారని, ఈ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుందని ఓ అధికారి వివరించారు.

ప్రమాదం తో అప్రమత్తమయిన భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా శ్రమించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఘటనపై పాకిస్థాన్ ఎంబసీ అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ ఘటన పట్ల పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంతాపం వ్యక్తం చేశారు.



Tags:    

Similar News