ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌.. బీజేపీపై క‌న‌క వ‌ర్షం కురిపిస్తున్నాయా?

Update: 2021-08-15 11:30 GMT
కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. వ‌చ్చీరావ‌డంతో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేలా తీసుకున్న సంచ‌ల న నిర్ణ‌యం.. ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌! కాంగ్రెస్‌కు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతున్న విరాళాల వెనుక బ్లాక్ మ‌నీ ఉంద‌ని, మ‌నీ లాండ‌రింగ్ కూడా జ‌రుగుతోంద‌ని.. అప్ప‌ట్లో ఆరోపించిన బీజేపీ దీనిని అరిక‌ట్టేందుకు న‌ర్మ గ‌ర్భంగా.. ఎల‌క్టోర‌ల్ బాండ్ ల‌ను 2017లో తీసుకువ‌చ్చింది. రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వాలనుకునే వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ, ఆ విరాళాలను మాత్రమే బ్యాలెన్స్‌షీట్‌లో నమోదు చేయడానికి వీలుగా ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టినట్లు కేంద్రం అప్ప‌ట్లో ప్ర‌క‌టించుకుంది.

విరాళాల కింద నల్లధనాన్ని ఖర్చు పెట్టకుండా నిరోధించేందుకు ఎన్నికల బాండ్లు సహకరిస్తాయని కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఇలా వచ్చిన రాజకీయ విరాళాలను సక్రమంగా వినియోగించే దిశలో ప్రోత్సహిం చేందుకే దాతల వివరాలను గోప్యంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే విష‌యం బీజేపీలో సంచ‌ల‌నంగా మారింది. ఎందుకంటే.. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌కు భారీ ఎత్తున విరాళాలు వ‌చ్చాయ‌ని చెప్పుకొన్న బీజేపీకి.. ఇప్పుడు.. భారీ ఎత్తున విరాళాలు వ‌ర‌ద ప్ర‌వాహంగా మార‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి దాదాపు రూ.2,555 కోట్ల రూపాయలు సమకూరినట్లు ఆ పార్టీ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో లభించిన రూ.1,450 కోట్ల కంటే ఇది దాదాపు 76 శాతం అధికంగా ఉంది. అదేస‌మ‌యంల కాంగ్రెస్‌కు 2019-20లో రూ.318 కోట్లు మాత్రమే విరాళాలుగా లభించాయి. ఇవి, 2018-19లో ఆ పార్టీకి లభించిన రూ.383 కోట్ల కన్నా 17 శాతం తక్కువ. 2019-20 ఆర్థిక సంవత్సరంలో గుర్తింపు పొందిన 18 రాజకీయ పార్టీలు ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం రూ.3,441 కోట్లను విరాళాలుగా అందుకున్నాయి.

వీటిలో 75 శాతం బీజేపీకే దక్కినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు కేవలం 9 శాతం నిధులు మాత్ర‌మే అందాయి. ఇతర ప్రతిపక్ష పార్టీలకు దక్కిన విరాళాలను పరిశీలిస్తే, తృణమూల్ కాంగ్రెస్‌కు రూ.100 కోట్లు, డీఎంకేకు రూ.45 కోట్లు, శివసేనకు రూ.41 కోట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి రూ.20 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.17 కోట్లు, రాష్ట్రీయ జనతాదళ్‌కు రూ.2.5 కోట్లు ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరాయి. ఎన్నికలు, రాజకీయ సంస్కరణల రంగంలో పనిచేసే ప్రభుత్వేతర సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఈ వివ‌రాలు అందించింది.  దీని ప్ర‌కారం.. ఇత‌ర పార్టీల కంటే.. సుమారు 68 శాతం అంటే రూ.4.5 వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తం బీజేపీకి దక్కాయి.

ఈ లెక్కలు చూస్తుంటే, బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకే ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టారా అనే సందేహాలు తెర‌మీదికి వ‌చ్చాయి.  వాస్త‌వంగా చూస్తే.. బీజేపీ తీసుకువ‌చ్చిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్య‌వ‌హారంపై అనేక సందేహాలు అప్ప‌ట్లోనే చోటు చేసుకున్నాయి. విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు గోప్యంగా ఉంచడం వల్ల, నల్లధనాన్ని విరాళంగా ఇచ్చే అవకాశం ఉంటుందని మేధావులు అప్ప‌ట్లోనే చెప్పుకొచ్చారు. అంతేకాదు.. భాఈ కార్పొరేట్ సంస్థలు తమ గుర్తింపును వెల్లడించకుండా భారీ విరాళాలు ఇచ్చేందుకు వీలుగా ఈ పథకాన్ని రూపొందించారనే విమర్శ కూడా ఉంది.

అందుకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్, న్యాయ మంత్రిత్వ శాఖ, పలువురు ఎంపీలు ఈ స్కీమ్‌పై ఎప్పటికప్పుడు ఆందోళనలు, అభ్యంతరాలు లేవనెత్తుతున్నారని, దీనికి వ్యతిరేకంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్నికల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు ఇస్తున్న చందాలు ఒక రకమైన "మనీ లాండరింగ్' అని కూడా వీరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్ర‌భుత్వ వాద‌న మ‌రోలా ఉంది.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, కేవైసీ పత్రాలు బ్యాంకులకు సమర్పించినవారు మాత్రమే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసేలా ఈ పథకాన్ని నియంత్రించామని చెప్పారు.

అయితే, ఏదైనా వివాదం వచ్చినప్పుడు లేదా క్రిమినల్ కేసు వేసినప్పుడు న్యాయస్థానంలో దాతల వివరాలు బహిర్గతం చేయవచ్చు. కానీ, అలాంటి పరిస్థితులేవీ క‌నిపించ‌కుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అంటే.. ఇప్పుడు బీజేపీకి ఎవ‌రెవ‌రు ఎంత ఇచ్చారు?  వారు ఎలాంటి ప‌రిస్థితిలో ఇచ్చారు.. అనే విష‌యాల‌ను ఎవ‌రూ క‌నిపెట్టే ప‌రిస్థితి లేకుండా పోయింద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక‌, ఎన్నికల బాండ్ల విషయంలో ఏడీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

ఈ ఏడాది మార్చిలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడానికి ముందు ఈ బాండ్ల విక్రయాన్ని నిలిపివేయాలం టూ సుప్రీం కోర్టులో వేసిన దావాను కోర్టు తిరస్కరించింది. 2018లో ఈ పథకం ప్రారంభమైందని, 2019, 2020లలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగిందని, 2021లో దీన్ని నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు లేవని అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల బాండ్లపై మధ్యంతర స్టే కోరుతూ గత ఏడాది ఏప్రిల్‌లో దాఖలైన పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. మొత్తంగా చూస్తే.. ఈ వ్య‌వ‌హారం వెనుక రాజ‌కీయ కోణం భారీగానే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News