మావోయిస్టుల కాల్పులు..24 మంది జవాన్లు మృతి

Update: 2017-04-24 16:38 GMT
ఛత్తీస్‌ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దక్షిణ బస్తర్‌ లోని బుర్కాపాల్ గ్రామ సమీపంలో మధ్యాహ్నం గస్తీ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు పెట్రేగిపోయారు. జవాన్లు గస్తీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో మొత్తం 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం జగదల్‌ పూర్ - రాయ్‌ పూర్ ఆస్పత్రులకు హెలికాప్టర్ ద్వారా తరలించారు. సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిని బస్తర్ డీఐజీ సుందర్‌ రాజ్ ధ్రువీకరించారు. మావోయిస్టుల కాల్పులతో జవాన్లు అప్రమత్తమయ్యారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల కోసం జవాన్లు జల్లెడ పడుతున్నారు. ఘటనాస్థలిలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. గతేడాది ఇదే ప్రాంతంలో జరిగిన మావోయిస్టుల దాడిలో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.

మావోయిస్టుల కాల్పుల్లో ఒకేసారి 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందడంపై ఛత్తీస్‌ గఢ్ సీఎం రమణ్ సింగ్ స్పందించారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు రమణ్ సింగ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ రాష్ర్ట పోలీసు ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమావేశం నిర్వహించారు. సుక్మా జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. ఎదురుకాల్పులపై వివరాలను సీఎం రమణ్ సింగ్ తెలుసుకున్నారు.

కాగా, సుక్మా జిల్లాలో మావోయిస్టుల ఘాతుకంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మావోయిస్టుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గస్తీ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టుల కాల్పుల ఘటనను ప్రధాని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. జవాన్ల త్యాగం వృథా పోనివ్వమని ప్రధాని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News