కరోనా కాటుకు అమెరికాలో 40 మంది భారతీయుల మృతి

Update: 2020-04-11 15:30 GMT
కరోనా మహమ్మారికి అగ్రరాజ్యం అమెరికా వణికిపోతోన్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో అమెరికా ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గడచిన 24 గంటల్లోనే అమెరికాలో 2108 మంది ప్రాణాలు కోల్పోయారంటే అమెరికాలో కరోనా పంజా తీవ్రత ఏమిటో అర్థమవుతోంది. ఒక్కరోజులోనే కరోనా వల్ల 2 వేల మరణాలు సంభవించిన తొలిదేశంగా అమెరికా నిలిచింది. కరోనా పుట్టిన చైనాకన్నా...వేగంగా విస్తరించిన ఇటలీ కన్నా.... అమెరికాలో భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుండడం శోచనీయం. అమెరికాలో కరోనా  పాజిటివ్ కేసులు 5 లక్షలు దాటగా...దాదాపు 19 వేల మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారని జాన్ హాప్ కిన్స్ నివేదికలో వెల్లడైంది. అమెరికాలో కరోనా ధాటికి ఇద్దరు తెలుగువారు సహా 40 మంది భారతీయులు చనిపోయారని - యూఎస్ ఏలో 1500 మందికిపైగా భారతీయులు కోవిడ్-19 బారిన పడ్డారని అక్కడి భారతీయ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.

అమెరికాలో కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయిన నగరం న్యూయార్క్. కరోనాకు హాట్ స్పాట్ గా మారిన న్యూయార్క్ తోపాటు న్యూజెర్సీలోనూ భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి న్యూయార్క్‌ లో 15 మందికిపైగా భారతీయులు చనిపోగా.. న్యూజెర్సీలో 12 మందికిపైగా మరణించారు. కరోనా బారినపడి చనిపోయినవారిలో ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు. న్యూజెర్సీలో నివసిస్తోన్న సన్నోవా అనలైటిక్స్ కంపెనీ సీఈవో హనుమంతరావు మారేపల్లి కరోనా బారినపడి మరణించారు. ఆయనకు భార్య - ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. న్యూజెర్సీలోని ఇండియన్ స్క్వేర్ లో అందరికీ సుపరిచితుడైన చంద్రకాంత్ అమిన్(75) కరోనా బారిన పడి మరణించారు. అమెరికాలో కరోనా వల్ల చనిపోయిన భారతీయుల్లో 17 మంది కేరళకు చెందిన వారు. గుజరాత్‌ కు చెందిన 10 మంది  పంజాబ్‌ కు చెందిన నలుగురు - ఒడిశాకు చెందిన ఒకరు కరోనా బారిన పడి మరణించారు.  చనిపోయిన వారిలో ఎక్కువమంది 60 ఏళ్ల పైబడిన వారు కాగా...ఒక్కరు 21 ఏళ్ల వ్యక్తి. పెన్సిల్వేనియా - ఫ్లోరిడాల్లోనూ నలుగురు ఇండో-అమెరికన్లు చనిపోయారు. టెక్సాస్ - కాలిఫోర్నియాల్లో ఒకరు చొప్పున ఇండో అమెరికన్లు చనిపోయారని తెలుస్తోంది. కరోనా వల్ల మరణించిన తమవారి అంత్యక్రియలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని తెలుస్తోంది. వీడియో కాల్స్ ద్వారానే అంత్యక్రియలను చూడాల్సి వస్తోందని తెలుస్తోంది. దీంతోపాటు, పలు సంఘాలకు చెందిన నాయకులకు కూడా కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది.

న్యూజెర్సీలోనే 400 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ అని తేలగా - అమెరికాలో 1000 మందికి పాజిటివ్ అని తేలిందని అక్కడి భారతీయ సంఘాల నాయకులు చెబుతున్నారు. న్యూయార్క్‌ లో భారతీయ ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కువగా కరోనా బారిన పడ్డారని వారు తెలిపారు. అమెరికాలోని భారతీయులు కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని న్యూజెర్సీలో నివసించే గుజరాత్ కు చెందిన నీలా పాండ్యా విజ్ఞప్తి చేశారు. తన కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకగా.. బెడ్ల కొరత వల్ల ఇద్దరిని మాత్రమే హాస్పిటల్లో చేర్పించారని - మిగతా ముగ్గురు ఇంట్లోనే చికిత్స పొందాల్సి వచ్చిందని తెలిపారు. మెడికల్ స్టాఫ్‌ కు మాస్క్‌ లు అందించేందుకు అమెరికాలోని భారతీయులు నిధులు సేకరిస్తున్నారని - భారతీయులకు కొందరు భారతీయ సంఘాల నాయకులు సాయం అందిస్తున్నారని తెలుస్తోంది. న్యూయార్క్ - న్యూ జెర్సీ - మేరీల్యాండ్ - వర్జీనియా - ఫ్లోరిడా - పెన్సిల్వేనియాలోని రెస్టారెంట్లు సమీపంలోని హాస్పిటళ్లకు ఆహారం అందిస్తున్నాయి వరల్డ్ హిందూ కౌన్సిల్ ఆఫ్ అమెరికా వాలంటీర్లు లోవెల్ జనరల్ హాస్పిటల్ లోని వైద్య సిబ్బందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. అంతేకాకుండా...లోకల్ పోలీసులు - ఫైర్ సిబ్బంది - ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషియన్లకు 85వేల గ్లోవ్స్ ను అందించారు.


Tags:    

Similar News