మహారాష్ట్రలో తాజాగా చోటు చేసుకున్న ఐదు పరిణామాలు

Update: 2019-11-28 06:53 GMT
మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయంలో మరో ఆసక్తికర సన్నివేశం ఈ సాయంత్రం చోటు చేసుకోనుంది. వేలాది మంది మధ్య శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. దీనికి అతిరథ మహారథులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మూడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిల్లోకి వెళితే..

1. తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న శివసేన తమపై ఎలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకు ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తోంది. భాగస్వామ్య పక్షాల వారి మనసులు గాయపడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉద్దవ్.. తన కుమారుడు ఆదిత్యకు మంత్రి పదవిని కేటాయించటం లేదని తెలుస్తోంది.

2. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరు కావాల్సిందిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు.. మాజీ ప్రధాని మన్మోహన్ ను కూడా హాజరు కావాల్సిందిగా కోరటమే కాదు.. వారిని స్వయంగా ఆహ్వానించేందుకు వీలుగా ఉద్దవ్ తన కుమారుడు ఆదిత్యను ప్రత్యేకంగా ఢిల్లీ పంపిస్తున్నారు. మిత్రపక్షాలతో చక్కటి సంబంధాల కోసం ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం.

3. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వంలో ఏపార్టీకి ఏయే పదవులు ఉండాలన్న విషయంపై క్లారిటీ వచ్చేసిందని చెబుతున్నారు. శివసేనకు ముఖ్యమంత్రి పదవితోపాటు 15 కేబినెట్ మంత్రులు ఉండనున్నారు. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు 13 మంత్రి పదవులు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవితో పాటు 13 మంత్రి పదవులు దక్కనున్నాయి.

4. కొన్ని గంటల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉద్దవ్ ఠాక్రే.. పార్టీ పత్రిక అయిన సామ్నాకు ఎడిటర్ పదవికి రిజైన్ చేశారు. సామ్నాకు కొత్త ఎడిటర్ గా పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వ్యవహరించనున్నారు.

5. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటివరకూ చోటు చేసుకున్న ట్విస్టుల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తమ పార్టీ నేత కమ్ అన్న కొడుకు అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవిని ఇప్పటికిప్పుడు ఇవ్వకూడదని నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో నెగ్గిన తర్వాత మాత్రమే అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం కుర్చీని అప్పజెబుతారన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News