షాకింగ్‌:అమ‌ర్ నాథ్ యాత్రికుల‌పై ఉగ్ర‌దాడి

Update: 2017-07-11 05:01 GMT
ఉగ్ర‌వాదులు రెచ్చిపోయారు. అమ‌ర్ నాథ్ యాత్ర‌ను ముగించుకొని స్వ‌స్థ‌లాల‌కు తిరిగి వెళుతున్న యాత్రికుల బ‌స్సుపై ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డ్డారు. విచ‌క్ష‌ణ‌ర‌హితంగా జ‌రిపిన కాల్పుల్లో ఆరుగురు మ‌హిళ‌ల‌తో స‌హా మొత్తం ఏడుగురు మృత్యువాత ప‌డ‌టం పెను సంచ‌ల‌నంగా మారింది. దాదాపు ప‌దిహేడేళ్ల త‌ర్వాత అమ‌ర్ నాథ్ యాత్రికుల‌పై ఉగ్ర‌దాడి చోటు చేసుకోవ‌టం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. మృతులంతా గుజ‌రాత్‌కు చెందిన వారే కావ‌టం గ‌మ‌నార్హం.
సోమ‌వారం రాత్రి 8.20 గంట‌ల స‌మ‌యంలో జ‌మ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. గ‌డిచిన కొద్దిరోజులుగా జ‌మ్మూకాశ్మీర్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొని ఉండ‌టం తెలిసిందే. వాస్త‌వానికి అమ‌ర్ నాథ్ యాత్రికుల బ‌స్సు మీద ఉగ్ర‌దాడి జ‌ర‌గ‌టానికి ముందే రెండు చోట్ల పోలీసుల‌పై ఉగ్ర‌దాడులు చేసేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌లం కావ‌టం గ‌మ‌నార్హం.

స‌రిగ్గా ఆ స‌మ‌యంలోనే యాత్రికుల బ‌స్సు క‌నిపించ‌టంతో ఉగ్ర‌వాదులు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా స‌ద‌రు బ‌స్సు మీద విరుచుకుప‌డ్డారు. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉంద‌ని చెబుతున్నారు. తాజా ఉగ్ర‌దాడిలో ఏడుగురు యాత్రికులు మ‌ర‌ణించ‌గా.. దాదాపు 32 మందికి తీవ్ర గాయాలు అయిన‌ట్లుగా చెబుతున్నారు. సోమ‌వారంరాత్రి యాత్రికుల బ‌స్సుపై ఉగ్ర‌దాడి జ‌ర‌గ‌టానికి ముందు జ‌మ్ము- శ్రీన‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై బోటెంగూలోని బుల్లెట్ ఫ్రూప్ పోలీస్ బంక‌ర్ పై కాల్పులకు తెగ‌బ‌డ్డారు ఉగ్ర‌వాదులు. అక్క‌డ పోలీసులు తీవ్రంగా ప్ర‌తిఘ‌టించ‌టంతో ఉగ్ర‌వాదులు వెన‌క్కి త‌గ్గారు. అక్క‌డ నుంచి ఖ‌నాబ‌ల్ స‌మీపంలోని పోలీస్ పికెట్ పైనా ఉగ్ర‌దాడికి పాల్ప‌డ్డారు. అయితే.. ఇక్క‌డా పోలీసులు ధీటుగా స్పందించి ఉగ్ర‌దాడికి బ‌లంగా స‌మాధానం ఇచ్చారు.

ఉగ్ర‌వాదుల‌కు.. భ‌ద్ర‌తా సిబ్బందికి మ‌ధ్య భీక‌ర దాడి జ‌రుగుతున్న స‌మ‌యంలోనే అమ‌ర్ నాథ్ యాత్రికుల‌తో కూడిన బ‌స్సు అటుగా వ‌చ్చింది. దీంతో.. ఉగ్ర‌మూక బ‌స్సుపై విచ‌క్ష‌ణ‌రహితంగా కాల్పులు జ‌రిపారు. జ‌మ్మూకు వెళుతున్న ఈ బ‌స్సు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌యాణిస్తుంద‌ని చెబుతున్నారు. దాడికి గురైన బ‌స్సు అమ‌ర్ నాథ్ యాత్రికుల వాహ‌న శ్రేణిలోనిది కాక‌పోవ‌టంతో భ‌ద్ర‌త‌ను క‌ల్పించ‌లేక‌పోయిన‌ట్లుగా పోలీసులు చెబుతున్నారు.

హైవే మీద రాత్రి 7 గంట‌ల త‌ర్వాత  భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రిస్తారు. ఆ త‌ర్వాత రోడ్డు మీద యాత్రికుల బ‌స్సులు రాకూడ‌ద‌న్న‌ది నిబంధ‌న‌. కానీ.. బ‌స్సు డ్రైవ‌ర్ ఆ రూల్‌ను బ్రేక్ చేయ‌టంతోనే ఈ దారుణం జ‌రిగింద‌ని అధికారులు చెబుతున్నారు. ఉగ్ర‌దాడికి గురైన బ‌స్సు నెంబ‌రు జీజే09 జెడ్ 9976గా గుర్తించారు. ఈ బ‌స్సును అమ‌ర్ నాథ్ ఆల‌య బోర్డు వ‌ద్ద రిజిస్ట‌ర్ చేసుకోలేద‌న్న విష‌యాన్ని గుర్తించారు.  వాస్త‌వానికి అమ‌ర్ నాథ్ యాత్రికులు ప్ర‌యాణించే వాహ‌న శ్రేణికి ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తారు. యాత్రికుల బ‌స్సుల‌కు సీఆర్ పీఎఫ్ ర‌క్ష‌ణ కూడా క‌ల్పిస్తారు.

యాత్రికుల బ‌స్సుపై విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపిన ఉగ్ర‌వాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందులో భాగంగా జ‌మ్మూ-శ్రీగ‌న‌ర్ హైవేను మూసేసి సోదాలు నిర్వ‌హిస్తున్నారు.

ఆ మ‌ధ్య‌న భ‌ద్ర‌తా బ‌ల‌గాలు హ‌త‌మార్చిన హిజ్బుల్ ముజాహిదీన్ క‌మాండ‌ర్ బుర్హాన్ వ‌నీ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఉగ్ర‌వాదులు తాజా దాడుల‌కు పాల్ప‌డి ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. అమ‌ర్ నాథ్ యాత్రికుల‌పై జ‌రిగిన ఉగ్ర‌దాడిని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ప‌రిస్థితిని స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించిన ఆయ‌న‌.. శాంతియుతంగా సాగుతున్న యాత్ర‌పై ఉగ్ర‌వాదుల పిరికిపంద చ‌ర్య మాట‌ల‌కు అంద‌ని బాధ‌ను క‌లిగిస్తోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ దాడిని ప్ర‌తి ఒక్క‌రూ ఖండించాల‌న్న మోడీ.. మృతుల కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. జ‌మ్మూకాశ్మీర్ ముఖ్య‌మంత్రి.. గ‌వ‌ర్న‌ర్ల‌తో తాను మాట్లాడాన‌ని.. అవ‌స‌ర‌మైన సాయాన్ని కేంద్రం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. యాత్రికుల మీద ఉగ్ర‌దాడిని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఖండించారు.
Tags:    

Similar News