రెండు డోసుల మధ్య గ్యాప్ ఎంత ఎక్కువైతే అంత మంచిదట !

Update: 2021-06-30 23:30 GMT
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక టీకాలు వేసిన దేశంగా ఇండియా ఓ రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే టీకాల మధ్య గ్యాప్ పై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. కోవిషీల్డ్ టీకా డోసుల మ‌ధ్య గ్యాప్‌ కి  సంబంధించి ఈ మద్యే చేసిన అధ్య‌య‌నం చెప్పేది వింటే ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది. రెండు డోసుల మ‌ధ్య 45 వారాల వ్య‌వ‌ధి ఉంటే, రోగ నిరోధ‌క‌త మ‌రింత మెరుగ్గా ఉంటుంద‌ని ఈ అధ్యయనం వెల్లడించింది. మొద‌ట్లో కరోనా రెండు టీకాల మ‌ధ్య గ్యాప్ నాలుగైదు వారాలు ఉండేది, దాన్ని ఆ త‌ర్వాత 12 నుంచి 16 వారాలుగా నిర్ణ‌యించారు.  

అయితే ఒక్కో ప‌రిశోధ‌న ఒక్కో ర‌కంగా వ్యాక్సినేష‌న్‌ పై ఫ‌లితాలు రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రీ ముఖ్యంగా మూడో డోసును కూడా తీసుకుంటే యాంటీబాడీల స్థాయిలు బాగా వృద్ధి చెందుతాయ‌ని ఈ అధ్యయనంలో వెల్లడైంది.18-55 ఏళ్ల మధ్య వయసున్న వాలంటీర్లపై బ్రిటన్‌ లోని ఆక్స్‌ ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్ల‌డించిన తాజా ఫ‌లితాలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. కొవిషీల్డ్ ఫ‌స్ట్ డోసును తీసుకున్నాక కనీసం ఏడాది వరకు వ్యక్తుల్లో యాంటీబాడీల స్థాయులు అధికంగా ఉంటున్నాయి. 12 వారాల విరామంతో రెండు డోసులను తీసుకున్నవారితో పోలిస్తే, 45 వారాల వ్యవధితో రెండో డోసును పొందినవారిలో యాంటీబాడీ స్థాయులు నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రెండో డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత యాంటీబాడీ స్పందన 18 రెట్లు పెరుగుతోంది. అంతేకాదు, రెండో డోసు తర్వాత ఆరు నెలల విరామంతో మూడో డోసు తీసుకుంటే యాంటీబాడీ స్థాయులు ఆరు రెట్లు అధికమవుతున్నాయి. ఈ ఫ‌లితాల‌పై మ‌రింత లోతుగా ప‌రిశోధ‌న జ‌రిపితే, అంతిమంగా వ‌చ్చే ఫ‌లితాల‌ను బ‌ట్టి డోసు తీసుకోవ‌డంపై నిర్ణ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది.  మొత్తానికి ఎంత ఆలస్య‌మైతే అంత మంచిగా ప‌నిచేస్తుంద‌ని కోవిషీల్డ్ టీకాపై తాజా అధ్య‌య‌నం చెబుతోంది.
Tags:    

Similar News