మజ్లిస్ కు ముకుతాడు వేసే టైమొచ్చింది

Update: 2016-03-16 17:30 GMT
ఇష్టారాజ్యంగా మాట్లాడటం.. అవసరమైతే చేయి చేసుకోవటం లాంటి చేష్టలతో ఇప్పటికే దారుణమైన ఇమేజ్ ఉన్న మజ్లిస్ కు.. తాజాగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన మాటలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అసద్ చేసిన వ్యాఖ్యలపై తిట్టి పోస్తున్నారు. తన తలకు తుపాకీ గురి పెట్టినా తన నోటి నుంచి భారత్ మాతాకీ జై అనే మాట చెప్పనంటూ బరితెగించిన అసద్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. అసద్ వ్యాఖ్యల్ని విమర్శించిన వారి విషయంలో అందరికంటే ఒక అడుగు ముందుకు వేసిన బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. షర్వాణీ.. టోపీ పెట్టుకోవాలని రాజ్యాంగం చెప్పిందా? అంటూ వ్యాఖ్యానించటం తెలిసిందే.

ఈ వ్యాఖ్యల మీద మజ్లిస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింల మనోభావాల్ని గాయపరిచారని.. జావేద్ అక్తర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. టోపీ పెట్టుకోవాలని.. షేర్వాణీ ధరించాలని రాజ్యాంగం చెప్పిందా? అన్న మాటకే మనసుకు గాయమైతే.. భారత్ మాతాకీ జై అననంటే అననని తెగేసి చెబుతున్న అసద్ మాటతో వందల కోట్ల భారతీయుల మనసులు గాయపడ్డాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. ముస్లింలకు క్షమాపణలు చెప్పాలంటున్న మజ్లిస్.. అసద్ చేసిన వ్యాఖ్యపై భారతీయుల మనోభావాలు దెబ్బ తినటంపై ఏ విధంగా సారీ చెబుతుంది? ఇంతకాలం వ్యక్తుల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అసద్ అండ్ కో.. తాజాగా దేశం విషయంలోనూ అదే వైఖరిని అనుసరించటాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే.. ఆ పార్టీకి ముకుతాడు వేసేందుకు అవసరమైన చర్యల్ని తీసుకోవటానికి వెనుకాడకూడదు.
Tags:    

Similar News