వైకాపా వైరస్ అయితే క్విక్‌ హీల్ ఎవరు సార్?

Update: 2017-11-10 11:37 GMT
తమకు ఏది తోస్తే అది విమర్శించేయడమే? తాము ఎలా చెలరేగుతున్నా అడిగే నాధుడు ఎవరూ లేకపోతే.. ఎవరికైనా సరే సంబరంగానే ఉంటుంది. అలాంటి సంబరాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు - ప్రభుత్వంలోని పెద్దలు ఎంజాయ్ చేస్తున్నారు. తమ నిర్ణయాల్లోని లోపాల్ని ఎత్తి చూపించే వారే లేనప్పుడు తాము ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతుందనే.. వ్యవహారం.. వారికి ఆనందం కలిగిస్తున్నట్లుంది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత.. లాబీల్లో మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షం లేని అసెంబ్లీ చాలా హాయిగా ఉన్నదంటూ ఆయన పేర్కొనడం విశేషం. అయితే మొత్తానికి జగన్ సభలకు జనం వెల్లువలా వస్తున్నారనే సంగతి మాత్రం మంత్రి ఆదినారాయణ మాటల్లోనే దొర్లడం విశేషం. కాకపోతే.. జగన్ సభలకు జనం రావడాన్ని దాచడం లేదు గానీ.. ఈ జనం మొత్తం ఓట్లు వేసేవాళ్లు కాదని తనదైన శైలిలో ముక్తాయింపు ఇస్తున్నారు. సభలకు - పెళ్లిళ్లకు వచ్చేవాళ్లు ఓట్లు వేయరట - గత ఎన్నికలకు ముందు బొత్స - రఘువీరా చాలా పెళ్లిళ్లు చేయించారట గానీ.. డిపాజిట్లు రాలేదట. ఓటు వేయించుకునే టెక్నిక్ వేరే ఉంటుందన్నట్లుగా మంత్రి సెలవిచ్చారు.

అయితే వైకాపా గురించి ఆయన చేసిన కామెంట్లు కీలకం. వైకాపా వైరస్ లాంటిది అని మంత్రి చెబుతున్నారు. ఐటీ శాఖ ఆయన డిపార్టు మెంటు కాదు గానీ.. ఐటీ పరిభాషలోనే ఆయన అభివర్ణించడం విశేషం. వైరస్ లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో - సభ అంతా ప్రశాంతంగా ఉన్నదని సెలవిస్తున్నారు.

వైకాపాను వైరస్ అంటున్నారు సరే.. మరి వైరస్ ను క్లీన్ చేసే క్విక్ హీల్ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ పాత్ర ఎవరిది? అంటే.. ఏ వైరస్ ను చూసి వీరంతా భయపడుతున్నారో? ఆ వైరస్ ను సభలోకి రానివ్వని పరిస్థితి సృష్టించిన క్విక్ హీల్ ఎవరు ? ఇలాంటి సందేహాలకు కూడా మంత్రి తన దైన శైలిలో జవాబులు చెబితే బాగుంటుందని జనం అంటున్నారు.
Tags:    

Similar News