16 రోజుల వ‌రుస బాదుడుకి సెల‌విచ్చారు

Update: 2018-05-30 05:45 GMT
దాదాపు రెండు వారాల‌కు పైనే పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని మార్చ‌కుండా ఉన్న మోడీ స‌ర్కారు.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన పోలింగ్ ముగిసిన వెంట‌నే.. ధ‌ర‌ల్ని బాద‌టం మొద‌లెట్టారు. ఎప్పుడూ లేని రీతిలో పెరిగిన ధ‌ర‌ల‌తో గ‌త రికార్డులు తుడుచి పెట్టుకుపోయాయి. చ‌రిత్ర‌లో తొలిసారి అత్య‌ధిక రేట్ల‌లో పెట్రోల్‌.. డీజిల్ అమ్మిన ఘ‌న‌త మోడీ స‌ర్కారు ఖాతాలో ప‌డింది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత నుంచి మొద‌లైన బాదుడు కార్య‌క్ర‌మం దాదాపు 16 రోజుల పాటు నిర్విరామంగా సాగింద‌ని చెప్పాలి. ప్ర‌జ‌లు.. ప్ర‌తిపక్షాలు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నా మోడీ స‌ర్కారు మాత్రం తాను పెంచాల‌నుకున్నట్లే పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని పెంచేసుకుంటూ పోయారు. దీనికి తోడు అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌టంతో.. బాదుడు విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌లేదు.

భారీ ఎత్తున ప‌న్నులు బాదేస్తున్నా.. అంత‌ర్జాతీయ ప‌రిణామాల ప్ర‌భావం ప్ర‌జ‌ల మీద ప‌డ‌కుండా ఉండేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకోవాల్సి ఉంది. అయితే.. త‌న‌కు వ‌చ్చే ఆదాయం రూపాయి తేడా వ‌చ్చినా త‌ట్టుకోలేని రీతిలో కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉండ‌టంతో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెర‌గ‌ట‌మే త‌ప్పించి త‌గ్గ‌ని ప‌రిస్థితి.

ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న వ్య‌తిరేక‌త‌ను జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కంతో భ‌ర్తీ చేయాల‌నుకున్నారో ఏమో కానీ.. అన్ని వ‌ర్గాల వారికి ఇబ్బందిక‌రంగా మారే పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల‌పై నియంత్ర‌ణ లేని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్ని త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. రోజువారీ స‌మీక్ష‌లో భాగంగా తాజాగా త‌గ్గింపు నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.  అంత‌ర్జాతీయంగా రూపాయి బ‌ల‌ప‌డ‌టం.. ముడి చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌టంతో పెట్రోల్.. డీజిల్ బాదుడ‌కు తాత్కాలికంగా ఆపేశారు. తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ పై 60 పైస‌లు త‌గ్గ‌గా.. డీజిల్ పైన 56 పైస‌లు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.  దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌తో పోలిస్తే పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు ఢిల్లీలో త‌క్కువ‌గా ఉంటాయి. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలోనే లీట‌రు పై త‌గ్గింపుతో పోలిస్తే.. మిగిలిన న‌గ‌రాల్లో ఇది కాస్త ఎక్కువ‌గానే ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి.. త‌గ్గింపు ఈ రోజు మాత్ర‌మేనా?. లేదంటే ప‌రుస పెట్టి మ‌రీ త‌గ్గిస్తారా? అన్న‌ది తేలాల్సి ఉంది. రేప‌టి సంగ‌తి ఎలా ఉన్నా.. ఈ రోజు వ‌ర‌కు అయితే మాత్రం సామాన్యుల‌కు కాస్తంత ఉప‌శ‌మ‌న‌మే.
Tags:    

Similar News