కరొనకి మందు లేదు ...అలా చేయాల్సిందే : ఎయిమ్స్ డైరెక్టర్

Update: 2020-03-16 18:30 GMT
చైనాలో ప్రారంభమైన ఈ మహమ్మారి... ఇప్పుడు దాని వెలుపల వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనా వెలుపల అత్యధికంగా ఇటలీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా అనేక దేశాల్లో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటం తో దీనిని ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే, వైద్యరంగం పరంగా ప్రపంచం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ ..ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ కి ఇంకా మందు కనిపెట్టలేదు. దీనిపై తాజా ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పంధిస్తూ .. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా మహమ్మారికి మందులేదని తెలిపారు.

ప్రస్తుతం దేశం లో ఈ వైరస్‌ తో బాధపడుతున్న వారందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని, అలాగే వారి సన్నిహితులు కూడా బాధితుల్లో ఉన్నారని . అలాగే కరోనా కి నిర్దిష్ట లక్షణాలు అంటూ ఏమీ ఉండవని, జ్వరం, దగ్గు, గొంతు లో మంట, జలుబు, ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయని అన్నారు. కొందరిలో కడుపునొప్పి, డయేరియా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయన్నారు. కరోనా వైరస్‌ కు ఔషధం లేదని, నివారణ ఒక్కటే మార్గమని అన్నారు. అందరూ పరిశుభ్రంగా ఉండడం వల్ల కరోనా వైరస్‌ నుంచి తప్పించుకోవచ్చని అన్నారు.

అలాగే, మాంసాహారం, గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుందన్న వార్తల్లో నిజం లేదని గులేరియా తేల్చి చెప్పారు. ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి మాత్రమే సోకుతుందని, మాంసాహారం, గుడ్లు తినడం వల్ల కాదని స్పష్టం చేశారు. మాంసాహారం వండుకునేటప్పుడు సాధారణంగా తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. వేడి వాతావరణం లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గి ఆ తర్వాత కనుమరుగవుతుందన్న వార్తలను కూడా గులేరియా కొట్టిపడేశారు. వేడి, చల్లని వాతావరణాలు ఉన్న సింగపూర్, యూరోపియన్ దేశాల్లోనూ ఈ వైరస్ విజృంభిస్తోందన్న విషయాన్ని అయన తెలిపారు.
Tags:    

Similar News