సంచలనంగా అసద్ ట్వీట్.. కరోనా మృతులు అమరులు

Update: 2020-04-03 06:10 GMT
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన నాటి నుంచి దాని మీద సరిగా స్పందించలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అనునిత్యం ముస్లిం సమాజం కోసం పోరాడేటట్లు చెప్పుకునే అసద్.. వైరస్ మీద అవగాహన కల్పించే విషయంలో చురుగ్గా వ్యవహరించలేదన్న విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. తనలోని లోపాల్ని ఎత్తి చూపుతున్నా స్పందించని అసద్ తాజాగా ఒక ట్వీట్ చేశారు.

కరోనా మృతులంతా అమరులుగా ఆయన పేర్కొన్నారు.  వైరస్ అంటువ్యాధితో మరణించిన ముస్లింలను అమరులుగా ఇస్లాం గుర్తిస్తుందని పేర్కొన్నారు. అలాంటి అమరుల అంతిమసంస్కారాలు కొద్ది మంది సమక్షంలో జరుగుతాయని పేర్కన్నారు. కొవిడ్ 19 కారణంగా మరణించిన వారి అంతిమసంస్కారాల్ని.. కేంద్రం పేర్కొన్న ప్రోటోకాల్ కు తగ్గట్లుగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ కరోనా కారణంగా తొమ్మిది మంది మరణిస్తే.. వారంతా ఢిల్లీలో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సదస్సులో పాల్గొన్న వారే.

ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. ముస్లింలు ఎవరైనా మరణిస్తే.. వారి భౌతికకాయానికి స్నానం చేయించటం.. నిండుగా వస్త్రం కప్పటం లాంటివి చేస్తుంటారు. అయితే.. కరోనా లాంటి ప్రమాదకర వైరస్ తో మరణించిన వారికి మాత్రం.. అందుకు భిన్నంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న గైడ్ లైన్స్ ప్రకారం అంత్యక్రియల్ని నిర్వహిస్తుంటారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్ని దూరం నుంచి చూసే అవకాశం కల్పిస్తారే తప్పించి.. వారిని ముట్టుకోవటం.. దగ్గరకు వెళ్లటానికి అనుమతించరు. ఈ నేపథ్యంలో అసద్ ట్వీట్ చేస్తూ.. కరోనా కారణంగా మరణించిన వారంతా అమరులని.. అలాంటివారికి ఇస్లాం పద్దతిలో అంతిమసంస్కారాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.


Tags:    

Similar News