హాలీవుడ్ హీరోను త‌ల‌పించేలా రియ‌ల్ హీరో

Update: 2018-10-01 04:49 GMT
ఇండోనేషియాను క‌కావిక‌లం చేసిన జంట ప్ర‌కృతి విప‌త్తుల చేసిన న‌ష్టం అంతా ఇంతా కాదు. ఈ ప్ర‌కృతి వైప‌రీత్యంతో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ చేతులెత్తేసిన వేళ‌.. ఒక వ్య‌క్తి చేసిన సాహ‌సం.. ప్ర‌కృతికి ఎదురొడ్డి.. ఆ మాట‌కు వ‌స్తే త‌న ప్రాణాల్ని ప‌ణంగా పెట్టి మ‌రీ భారీగా ప్రాణ‌న‌ష్టాన్ని నివారించిన వైనం చూస్తే.. హాలీవుడ్ యాక్ష‌న్ సినిమాల్లో హీరో కూడా ఎందుకు ప‌నికి రాడు.

ఇండోనేషియాలో తాజాగా చోటు చేసుకున్న భూకంపం - సునామీ కార‌ణంగా వంద‌లాది మంది మ‌ర‌ణించిన‌ట్లుగా ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. దేశ ఉపాధ్య‌క్షుడు సైతం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య వేల‌ల్లో ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ప‌లూలోని మురియారా ఎస్ ఐఎస్ అల్ జుఫ్రీ ఎయిర్ పోర్ట్ లో ప‌ని చేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్ చేసిన సాహ‌సాన్ని ఇప్పుడు అక్క‌డి మీడియా ప్ర‌ముఖంగా ప్ర‌స్తావిస్తోంది.

21 ఏళ్ల ఆంథోనియ‌స్ గున‌వ‌న్ అగుంగ్ చేసిన సాహ‌సం ముందు హాలీవుడ్ యాక్ష‌న్ హీరో సైతం దిగ‌దుడుపుగా చెప్పాలి. ఎందుకంటే.. అత‌గాడు పలూలో ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న వేళ  శ‌క్తివంత‌మైన భూకంపం ఎయిర్ పోర్ట్‌ ను కుదిపేసింది. దీంతో.. అక్క‌డి వారంతా హాహాకారాలు చేసిన ప‌రిస్థితి.

ఇలాంటి వేళ‌.. ప‌రిస్థితిని త‌న కంట్రోల్ లో తీసుకొని.. ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది మొత్తాన్ని బ‌య‌ట‌కు పంపేసిన ఆంథోనియ‌స్.. తాను మాత్రం అక్క‌డే ఉన్నాడు. ర‌న్ వే మీద ఉన్న విమానాల‌కు ఒక్కొక్క‌టిగా వ‌రుస పెట్టి క్లియ‌రెన్స్ లు ఇవ్వ‌సాగాడు. చివ‌రి విమానం టేకాఫ్ అయిన త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు.

అప్ప‌టికే భూకంపం తీవ్ర‌త‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భ‌వ‌నం చిగురుటాకులా వ‌ణికిపోతోంది. ఇలాంటి వేళ‌.. అందులో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే  ప్ర‌య‌త్నం చేశాడు. కుద‌ర‌ద‌ని తేలిన త‌ర్వాత‌.. నాలుగో అంత‌స్థు నుంచి బ‌య‌ట‌కు దూకేశాడు. అంత ఎత్తు నుంచి కింద‌కు ప‌డ‌టంతో కాలు విర‌గ‌టంతో పాటు అంత‌ర్గ‌త ర‌క్త‌స్రావ‌మైంది. దీంతో అత‌న్ని హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మెరుగైన వైద్యం కోసం ఆయ‌న్ను మ‌రో ఆసుప‌త్రికి పంపేందుకు ఎయిర్ అంబులెన్స్ కోసం ప్ర‌య‌త్నించారు. అది వ‌చ్చే లోపే ఆంథోనియ‌స్ ప్రాణాలు విడిచాడు. త‌న ప్రాణాన్ని లెక్క చేయ‌కుండా వంద‌లాది ప్రాణాల కోసం అత‌గాడి సాహ‌సం చూసిన‌ప్పుడు ఏ హాలీవుడ్ యాక్ష‌న్ హీరో అయినా దిగ‌దుడుపే.
Tags:    

Similar News