అక్బరుద్దీన్ ను ఆపడం కేటీఆర్ వల్ల కాలేదు..

Update: 2015-09-29 08:53 GMT
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ - కాంగ్రెస్ - బీజేపీ ఎమ్మెల్యే లు చేయలేని పనికి అక్బర్ అసెంబ్లీ సాక్షిగా చేసి చూపించారు. దీంతో అక్బర్ స్పీడుకు కళ్లెం వేయాలని మంత్రి కేటీఆర్ ప్రయత్నం చేసినా ఆయన వల్ల కాలేదు. దీంతో బావ ఇబ్బందిని గుర్తించిన హరీశ్ రావు ఆయన పరువు పోకుండా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం నాటి పరిణామాలు చూస్తే టీఆరెస్ - ఎంఐఎంల మధ్య హోరాహోరీగా ఉందన్న విషయం అర్థమవుతోంది.

రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో రైతుల పంట పొలాలకు నీరందితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ శాసన సభ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. మూడు ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయిందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వివరణ ఇవ్వడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రభుత్వం తప్పంతా ప్రకృతిపైనే నెట్టేసే ప్రయత్నం చేస్తోందన్నారు. వర్షాలు సరిగా పడిన ప్రాంతాల్లో కూడా రైతుల ఆత్మహత్యలు జరిగాయని, మరి వీటికి కారణమెవరని ఆయన ప్రశ్నించారు. మంత్రుల ఇలాకలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యమేనంటూ మంత్రుల నియోజకవర్గాల్లో రైతుల ఆత్మహత్యలన్నీ లెక్కలు చెప్పారు.

కేటీఆర్‌ నియోజకవర్గంలో 18 ఆత్మహత్యలు - ఈటెల రాజేందర్‌ నియోజకవర్గంలో 15 - హరీష్‌ రావు నియోజకవర్గంలో 11 - చందూలాల్‌ నియోజకవర్గంలో 11 మంది - మహేందర్‌ రెడ్డి నియోజకవర్గంలో 10 - జూపల్లి ప్రభాకర్‌ నియోజకవర్గంలో 10 - లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అక్బర్ చెప్పడంతో అధికారపక్షం ఏమీ అనలేకపోయింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయని అక్బర్ పదేపదే చెప్పారు. మెదక్ జిల్లాలో 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రైతులకు కిసాన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. లక్షలమంది దరఖాస్తు చేసుకుంటే 8వేల మందికి మాత్రమే కిసాన్ కార్డులు ఇచ్చారన్నారు. మంత్రులు, అధికారులు హైదరాబాదులో ఉండి ఏం చేస్తున్నారని నిలదీశారు. నెపాన్ని ప్రభుత్వం పూర్తిగా వరుణుడిపై నెట్టేస్తోందన్నారు. అసెంబ్లీలో మేం మాట్లాడుతుంటే నవ్వుతున్నారు... అక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇక్కడ నవ్వుతున్నారని మండిపడ్డారు. రోజుకో రైతు చనిపోతున్నాడంటూ లెక్కలు చెప్పారు. విపక్ష నేతలు మాట్లాడుతుంటే నవ్వులాటగా తీసుకుంటారా అంటూ ఆగ్రహించారు.

దీంతో కేటీఆర్ లేచి అక్బరుద్దీన్ ఓవైసీ సూటిగా మాట్లాడాలని సూచించారు. తామేమీ నవ్వడం లేదని.. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గానె  ఉందని చెప్పారు. దానికి అక్బర్ స్పందిస్తూ... నేను సీదా(సూటి)గా ఏం మాట్లాడలేదో చెప్పండి... కేటీఆర్ అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి... సలహాలు చెప్పదలచుకుంటే టిఆర్ ఎస్ సభ్యులకు చెప్పుకోవడం మంచిదంటూ అక్బర్ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ దశలో అక్బర్ వాగ్దాటికి ఎదురులేకపోవడంతో కేటీఆర్ ఆ స్థాయిలో సమాధానమివ్వలేకపోయారు. దాంతో ఆలస్యం చేస్తే పరువు పోతుందన్న ఉద్దేశంతో హరీశ్ రావు కలగజేసుకుని ఒక్క సభ్యుడికే అంత సమయమిస్తే ఎలా అంటూ స్పీకర్ తో అన్నారు. దాంతో ఏం చేయాలో హరీశ్ సూచించారని అర్థం చేసుకున్న స్పీకర్.... అక్బరు తన ప్రసంగాన్ని తొందరగా ముగించేలా ఒత్తిడి చేసి మొత్తానికి ముగించారు. ఆ రకంగా అక్బర్ కు చిక్కి విలవిలలాడిన కేటీఆర్ ను హరీశ్ బుర్ర ఉపయోగించి రక్షించారు.
Tags:    

Similar News