వారందరిని వెంటనే జైల్లో వేయాలంటూ అక్బరుద్దీన్ ఆగ్రహం

Update: 2019-12-05 09:33 GMT
నియంత్రణ లేకుండా మాట్లాడే నేతలకు దేశంలో కొదవ లేదు. అందునా రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వారి సంఖ్య కాస్త ఎక్కువే. కాకుంటే.. చాలామంది నేతల పరిధి వారి రాజకీయంతోనూ.. రాజకీయ ప్రత్యర్థుల వరకే పరిమితమవుతుంది. మజ్లిస్ అధినేత కమ్ ఎంపీ అసద్ సోదరుడు అక్బరుద్దీన్ విషయంలో మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితి.

మతం ఆధారంగా చేసుకొని ఆయన చేసే వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో సంచలనంగా మారుతుంటాయి. చాలామంది తెలుగు రాజకీయ నేతలకు భిన్నంగా ఆయన పెద్ద పెద్ద అంశాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా అదే తీరుతో వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సుప్రీం కోర్టు ధర్మాసనం వెలువరించిన అయోధ్య తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివాదాస్పద కట్టడాన్ని కూల్చేసిన వారందరిని వెంటనే అరెస్టు చేయాలని.. జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం ఇచ్చిన తీర్పును సమీక్షించాలన్నారు. మసీదును మరోచోట స్థలం కేటాయించటం ఆమోదయోగ్యం కాదన్న ఆయన.. వివాదాస్పద కట్టటాన్ని కూల్చివేసిన వైనంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలన్నారు.

అయోధ్య అంశంపై సుప్రీం తీర్పును సమీక్షించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకున్న నిర్ణయానికి స్వాగతించిన అక్బరుద్దీన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో బాబ్రీ మసీదును తిరిగి నిర్మించాలని కోరుతూ ఈ నెల ఆరున (రేపు.. శుక్రవారం) శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కటమే కాదు.. శుక్రవారం హైదరాబాద్ మహా నగరంలో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఉత్కంటగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News