రాజ‌ధాని త‌మ్ముళ్ల‌లో ర‌చ్చ ముదిరిపోతోంది

Update: 2016-12-20 22:30 GMT
క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు ర‌చ్చ‌కెక్కుతున్నాయి. అదికూడా రాజకీయ చైతన్యానికి మారుపేరైన గుంటూరు జిల్లాలో అధికార పార్టీ త‌మ్ముళ్లు త‌గువులాడుకుంటున్నారు. ఏకంగా మంత్రుల స్థాయి నాయ‌కుల మ‌ధ్యే విబేధాలు ముదిరిపోవ‌డం ఆస‌క్తిక‌రం. జిల్లాలోని దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే ప‌రిస్థితి ఉంద‌ని స‌మాచారం.

పత్తిపాడులో మంత్రి రావెల కిషోర్‌ బాబుకు అసమ్మతి బలపడుతోంది. ఆయన వద్దకొచ్చేవారిని మినహా దూరంగా ఉంటున్న వారిని పట్టించుకోవడం లేదని, దీర్ఘకాలికంగా పార్టీలో పనిచేసిన వారికంటే కొత్తవారికే అందలం దక్కుతుందనే విమర్శలొస్తున్నాయి. గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి వ్యతిరేకంగా ఒక బలమైన గ్రూపు పావులు కదుపుతోందని స‌మాచారం. ఆయన వైసీపీలోకి వెళ్తారని టీడీపీలోని కొంత మంది నేతలు ప్రచారం చేస్తున్నారు. పార్టీకి కంకణబద్ధుడినై పనిచేస్తున్నా తగిన ప్రాధాన్యమివ్వడం లేదని ఆయన సైతం కొంత కాలంగా కినుక వహిస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డు పాలకవర్గం ఎంపికలో మంత్రి పుల్లారావుకు - ఆయనకు మధ్య ఏర్పడిన అంతరాలు ఇంకా కొనసాగుతున్నాయి. తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌ కు - పార్టీలోని సీనియర్‌ నేతలకు మధ్యా అంతరాలున్నట్లు తెలుస్తోంది.

గతంలో జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసి టీడీపీలోకి వచ్చిన శ్రావణ్‌ కుమార్‌ ఇప్పటికీ అధికారి హోదాలోనే వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు - ప్రజలతో మమేకం కాలేకపోతున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బాపట్లలో ఎమ్మెల్సీ సతీష్‌ ప్రభాకర్‌ కు - మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డికి మధ్య విబేధాలు తీవ్రరూపం దాల్చాయి. టీడీపీ సభ్యత్వం నమోదు కార్డుల జారీలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరాటానికి దారితీసింది. పదవి నుండి తప్పుకోవాలని బాపట్లలో ఇటీవల ఎంపీపీ మానం విజేతపై ఎమ్మెల్సీ ఒత్తిడి చేయడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. అదే రీతిలో సత్తెనపల్లి - మాచర్ల - మంగళగిరి నియోజకవర్గాల్లో స్థానిక సంస్థల ప్రతినిధులకు, అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జిలకు మధ్య ఏర్పడిన వివాదాలు చిలికిచిలికి గాలివానగా మారుతున్నాయని అంటున్నారు. మంగళగిరిలో ఇటీవల ఛైర్మన్‌ కు - వైస్‌ ఛైౖర్మన్‌ కు మధ్య తీవ్ర విబేధాలు ఏర్పడ్డాయి. సొంత పార్టీకి చెందిన వైస్‌ ఛైర్మన్‌ సంకా బాలాజీ గుప్తాపై దాడితో ఆర్యవైశ్య సంఘాలు మండిపడి పార్టీలో కొనసాగాలో వద్దో త్వరలో తేల్చుకుంటామని హెచ్చరించారు.

సత్తెనపల్లిలోనూ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆతుకూరి నాగేశ్వరరావుపైనా గతంలో ఇలాగే అక్రమ కేసులు నమోదు చేసి వేధించిన వ్యవహారంపై అక్కడి టీడీపీనేతల మీద వర్తకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మాచర్లలో మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ గోపవరపు శ్రీదేవి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాష్ట్రంలోనే సంచలనం కలిగించింది. ఎన్నికల్లో బాగా ఖర్చుపెట్టించి పదవి నుంచి తప్పుకోవాలని శ్రీదేవిపై ఒత్తిడి తేగా ఆమె భర్త గుండెపోటుతో మృతి చెందారు. భర్త మృతిని జీర్ణించుకోలేని ఆమె అక్టోబరు 21న ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు - నియోజకవర్గ ఇన్‌ ఛార్జిల పెత్తనం స్థానిక నేతలకు శరాఘాతంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News