సీరియల్ కిల్లర్ జూలీ ఆత్మహత్యాయత్నం

Update: 2020-02-27 14:24 GMT
ఆస్తి కోసం ఆరుగురు కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా హత్య చేసిన జూలీ ఉదంతం గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కట్టుకున్న భర్తతో పాటు అత్తమామలు - బంధువులకు సైనైడ్ ఇచ్చి సైలెంట్ గా మర్డర్ చేసిన సైకో కిల్లర్ జూలీ అమ్మా జోసెఫ్ గురించి తెలుసుకున్న కేరళ పోలీసులు షాక్ కు గురయ్యారు. జూలీ పాపం పండడంతో గత ఏడాది ఆమె అరెస్టయింది. అయితే, అతి కిరాతకంగా హత్యలు చేసిన కఠినాత్మురాలైన జూలీ....తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైనం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కోజికోడ్‌ జైలులో ఉన్న జూలీ చేయి కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సకాలంలో స్పందించిన జైలు అధికారులు జూలీని రక్షించారు. అయితే, ప్రస్తుతం కోజికోడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జూలీకి చికిత్స జరుగుతోందని - ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

14 ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా కుటుంబ సభ్యులను హత్య చేస్తోన్న జూలీ వ్యవహారం గత ఏడాది వెలుగులోకి వచ్చింది.అమెరికాలో ఉండే జూలీ భర్త థామస్‌ రాయ్‌ సోదరుడు మోజో ఫిర్యాదుతో జూలీ గుట్టురట్టయింది. ఇంటి పెద్ద అయిన అన్నమ్మ థామస్‌  2002లో - ఆరేళ్ల తరువాత 2008లో ఆమె భర్త టామ్‌ థామస్‌ చనిపోయారు. 2011లో వారి కుమారుడు - జూలీ భర్త రాయ్‌ థామస్‌ మరణించాడు. అన్నమ్మ సోదరుడు మేథ్యూ 2014లో - వారి బంధువు సిలీ - ఆమె ఏడాది వయస్సున్న కుమార్తె 2016లో ప్రాణాలు కోల్పోయారు. రాయ్‌ థామస్‌ మరణించిన తరువాత సిలీ భర్తను జూలీ రెండో పెళ్లి చేసుకుంది. ఆస్తిపై హక్కు కోసం అన్నమ్మ థామస్ ను - ఆస్తిలో మరింత వాటా కోసం టామ్ ను - విబేధాలు రావడంతో భర్త రాయ్ ను జూలీ హతమార్చింది. రాయ్‌ మృతదేహాన్ని పోస్ట్‌ మార్టమ్‌ చేయాలని ఒత్తిడి చేసినందువల్ల అన్నమ్మ సోదరుడు మేథ్యూని - సిలీ భర్తను పెళ్లి చేసుకోవడం కోసం సిలీతో పాటు ఆమె కూతురుని జూలీ అడ్డు తొలగించుకుంది. తన అన్నయ్య  - కుటుంబసభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో రాయ్‌ థామస్‌ సోదరుడు మోజో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూలీ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో, 2019 అక్టోబర్ లో జూలీతో పాటు ఆమె స్నేహితుడైన ఎంఎస్‌ మాథ్యూని - వారికి సైనైడ్‌ సరఫరా చేసిన ప్రాజి కుమార్‌ లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Tags:    

Similar News