అంబానీ ఇంట పెళ్లి సందడి.. అంబానీ చిన్న కోడలు ఎవరంటే?

Update: 2022-12-29 13:34 GMT
అపర కుబేరుడు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు. తన స్నేహితురాలు రాధికా మర్చంట్ తో అనంత్ అంబానీ నిశ్చితార్థం గురువారం ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే అంబానీ చిన్న కోడలు గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

అనంత్ అంబానీకి కొన్నేళ్ల కిందటే రాధిక మర్చంట్ పరిచయమైంది. వీరిద్దరు కూడా వారసత్వంగా వస్తున్న తమ వ్యాపారాల్లో చురుకుగా పాల్గొనేవారు. అనంత్ అమెరికాలో బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆ తర్వాత రిలయన్స్ లోని జియో.. రిటైల్ వెంచర్స్ బోర్డుల్లో సభ్యుడిగా.. వివిధ హోదాల్లో సేవలందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో ఎనర్జీ బిజినెస్ కు నేతృత్వం వహిస్తున్నాడు.

ఇక రాధిక న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె ప్రస్తుతం ఎన్ కోర్ హెల్త్ కేర్ బోర్డు డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఆమె తల్లిదండ్రులు శైలా.. వీరన్ మర్చంట్. కాగా ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ.. శ్లోకా మెహతా వివాహ వేడుకలో రాధికా మర్చంట్‌ పేరు వెలుగులోకి వచ్చింది.

రాధిక మర్చంట్ ను అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు రావడంతో ఆమె పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే నేడు రాజస్థాన్లోని నథ్ ద్వారాలో శ్రీనాథ్ జీ ఆలయంలో అనంత్-రాధిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీంతో ఆమె ప్రత్యేకతల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

అనంత్ తో రాధిక మర్చంట్ మధ్య స్నేహంగా చాలాకాలంగా కొనసాగుతోంది. 24 ఏళ్ళ రాధికా శ్రీ నిభా ఆర్ట్స్ నుంచి భరత నాట్యంలో శిక్షణ పొందారు. తన పాఠశాల విద్యను ముంబైలోని కేథడ్రల్.. జాన్ కానన్ స్కూల్.. ఎకోల్ మోండియల్ వరల్డ్ స్కూల్ లో పూర్తి చేశారు. అనంతరం న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్‌.. ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ ను రాధిక మర్చంట్ పూర్తి చేసింది.

2017లో రాధికా మర్చంట్ ఇస్ప్రవా టీమ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. రాధికకు చదవడం.. ట్రెక్కింగ్.. స్విమ్మింగ్ చేయడంతోపాటు కాఫీ తాగడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అదేవిధంగా రాధిక కొన్ని ఎన్జీవోలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో సేవలందిస్తున్నారు. చిన్నతనంలో శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. ప్రముఖ డ్యాన్సర్‌ భావనా థాకర్‌ వద్ద భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది.

ఇటీవలే రాధికా మర్చంట్‌ భరతనాట్యం శిక్షణ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే అంబానీ కుటుంబం రాధిక కోసం ఘనంగా అరంగేట్రం కార్యక్రమం నిర్వహించారు. జూన్ 5న ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో రాజకీయ.. సినీ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా ఈ వేడుక జరిగింది. ఆమె భరతనాట్యం కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ మారాయి.

కాగా 2018లో అనంత్.. రాధికా మర్చంట్‌ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీరిద్దరు ఆ ఫోటోలో మ్యాచింగ్ గ్రీన్ దుస్తులతో కనిపించారు. ప్రియాంక చోప్రా-నిక్‌ జోనాస్‌ వివాహ వేడుకలకు అంబానీ కుటుంబంతో కలిసి రాధికా మర్చంట్‌ హాజరైంది. అప్పటి నుంచే వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ఈక్రమంలోనే ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News