డేంజ‌ర్ కానున్న డాల‌ర్ డ్రీమ్స్‌

Update: 2015-11-26 17:30 GMT
డాల‌ర్ డ్రీమ్స్ దైవాదీనం స‌ర్వీసు కానున్నాయా? ప‌్ర‌తిభ ఉన్నా.. అమెరికాలో మారుతున్న చ‌ట్టాలు భార‌తీయుల పాలిట శాపంగా మార‌నున్నాయా? చ‌క్క‌గా చ‌దువుకొని.. అమెరికాలో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించి.. చ‌క్క‌టి ఉద్యోగంతో సెటిల్ కావాల‌న్న ఆలోచ‌న‌తో డాల‌ర్ డ్రీమ్స్ కనేవారికి రానున్న రోజులు గ‌డ్డుగా మార‌నున్నాయా? అంటే.. అవున‌నే చెబుతున్నారు నిపుణులు.

ఆమెరికాకు పెరిగిన డిమాండ్‌.. అక్క‌డి స్థానిక ప‌రిస్థితుల‌తో మొత్తంగా అమెరికా క‌ల‌లు క‌ల్ల‌ల‌య్యే ప‌రిస్థితి. ఏదోలా అమెరికాకు వెళితే.. సెట్ చేసుకోవ‌చ్చ‌న్న మాట ఇక‌పై వినిపించే అవ‌కాశం లేన‌ట్లే. అమెరికా చ‌ట్టాలు క‌ఠినంగా మారిపోతున్న నేప‌థ్యంలో చ‌దువుకోవ‌టానికి అమెరికా ఓకే కానీ.. అక్క‌డ ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ కావ‌టానికి ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌ని విధంగా అమెరికా త‌న చ‌ట్టాల్ని మార్చేస్తోంది. అందుకు తాజాగా తీసుకున్న నిర్ణ‌యాలే నిద‌ర్శ‌నం.

వ‌ర్క్ ప‌ర్మిట్ కోసం ఇచ్చే హెచ్‌1బీ వీసాల విష‌యంలో అమెరికా ప్ర‌భుత్వం పెడుతున్న స‌రికొత్త ఆంక్ష‌ల నేప‌థ్యంలో అమెరికాకు వెళ్లాల‌నుకునే విద్యార్థులు ఆచితూచి అడుగులు వేయాలి. ఈ విష‌యంలో ఏమాత్రం తేడా కొట్టినా ల‌క్ష‌ల రూపాయిలు న‌ష్ట‌పోవ‌ట‌మే కాదు.. లేనిపోని నిరాశ‌.. నిస్పృహ‌ల‌తో కుంగిపోవాల్సిన దుస్థితి. అమెరికాకు చ‌దివేందుకు రార‌మ్మంటూ ఆహ్వానిస్తున్న అగ్ర‌రాజ్యం.. అక్క‌డ కోర్సు విజ‌య‌వంతంగా పూర్తి చేసిన త‌ర్వాత ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించే ద‌గ్గ‌ర మోకాలు అడ్డుతోంది. ఇదే ఇప్పుడున్న పెద్ద స‌మ‌స్య‌గా చెప్పొచ్చు.

గ‌తంలో ఉన్న‌త విద్య కోసం అమెరికాకు వెళ్లే విద్యార్థులు.. కోర్సులు పూర్తి చేసిన త‌ర్వాత అక్క‌డే సెటిల్ అయ్యేందుకు ఉపాధి అవ‌కాశాలు ల‌భించేవి. కొన్నిసార్లు క‌ష్ట‌మైనా.. కిందామీదా ప‌డితే ఏదో ర‌కంగా సెటిల్ అయ్యే ఛాన్స్ లు ఉండేవి. కానీ..ఇప్పుడా ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. అమెరికాలో తాజాగా మార్చిన నిబంధ‌న‌లు అమెరికా క‌ల‌ల‌కు క‌ళ్లాలు వేస్తున్నాయి. ఉపాధికి వీలు క‌ల్పించే హెచ్‌1బీ వీసాల జారీని క‌ఠిన‌త‌రం చేసింది.

గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన ఏడాది లోపే ఉద్యోగం సంపాదించుకోవాల్సి ఉంటుంది. అంటే..హెచ్‌1బీ వీసా ఏడాదిలోపే పొందాలి. ఒక‌వేళ సాధ్యం కాకుంటే.. గ‌రిష్ఠంగా ఐదేళ్ల పాటు ఏదో ఒక కోర్సు చేస్తూ ఉండొచ్చు. అంటే.. ఉద్యోగం సంగ‌తి త‌ర్వాత నిత్యం చ‌దువుతూ ఉండాలి. ఎందుకంటే.. ఏదైనా  కోర్సు చేస్తుంటే..అందుకు ఫీజులు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది భార‌త్‌ నుంచి అమెరికాకు వెళ్లిన వారు 1.34 ల‌క్ష‌ల మంది ఉన్నారు. ఒక్కో సెమిస్ట‌ర్‌ కు వారు త‌క్కువ‌లో త‌క్కువ ఆరువేల డాల‌ర్లు ఫీజు రూపంలో చెల్లించ‌టం ద్వారా అమెరికాకు వెళ్లిన మొత్తం 15.9వేల కోట్లు. ఇంత భారీ మొత్తంలో ఫీజుల రూపంలో వెళుతున్నా.. ఉపాధి ఇచ్చే  విష‌యంలో అమెరికా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది.

లాట‌రీ ద్వారా వీసా పొందేందుకు మూడేళ్ల‌లో మూడు అవ‌కాశాలు ఉండేవి. ఇప్పుడు దాన్ని రెండేళ్ల‌కు కుదించి.. రెండు అవ‌కాశాలే క‌ల్పించ‌నున్నారు. ఇది వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నుంచి కొత్త నిబంధ‌న అమ‌లు కానుంది.  ఈ కొత్త రూల్ ఇంకా అమ‌లు కాకుండానే.. మ‌రో బిల్లుకు అమెరికా స‌ర్కారు సిద్ధం అవుతోంది. దాని ప్ర‌కారం గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు ఏడాది లోపే హెచ్‌1బీ వీసాలు పొందాలి.లేదంటే.. వారు గ‌రిష్ఠంగా ఐదేళ్ల పాటు ఏదో ఒక కోర్సు చేస్తూనే  ఉండాలి. అంటే.. ఈ కొత్త బిల్లు కానీ చ‌ట్టంగా మారితే.. ఏడాది వ్య‌వ‌ధిలోనే ఉద్యోగం సంపాదించాలి. లేకుంటే అమెరికా నుంచి తిరిగి వ‌చ్చేయాలి. కాదు.. అక్క‌డే ఉండాలంటే.. అమెరికాలో ఏదో ఒక  కోర్సు చేయాలి. దీనికి అయ్యే ఖ‌ర్చు భారీగా ఉండే అవ‌కాశం ఉండ‌టంతో.. అమెరికా గురించి ఫ్యూచ‌ర్ ప్లాన్ వేసుకునే వారు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ మాత్రం తొంద‌ర‌ప‌డినా మొత్తానికే ముప్పు వ‌చ్చే అవ‌కాశం ఉంది. గ‌తంలో మాదిరి ఓ మోస్త‌రు విద్యార్థులు అమెరికా ఆశ‌ల్ని వ‌దిలేసుకుంటే మంచిది. చ‌క్క‌టి స్కోర్ ఉండి.. అమెరికాలో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డినా.. ఆర్థిక స్తోమ‌తు ఉంద‌నుకుంటే ఓకే. లేదంటే.. లేనిపోని ఇబ్బందులు త‌ప్ప‌న‌ట్లే.
Tags:    

Similar News