'షా' కు ఈ పెండింగ్ కేసుల చిట్టా క‌న‌బ‌డ‌లేదా?

Update: 2018-05-07 13:33 GMT
ప‌లు కేసులు ఎదుర్కొంటోన్న నేత‌ల‌కు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీ ఎమ్మెల్యే టికెట్ల‌ను కేటాయించింద‌ని - అవినీతి ర‌హిత భార‌త్ కు ప్ర‌ధాని మోదీ చేస్తోన్న కృషి అమోఘ‌మ‌ని ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రధాని పార్టీలో గబ్బర్‌ సింగ్‌ గ్యాంగ్ ఉంద‌ని - ‘షోలే’ చిత్రంలో లాగా గబ్బర్‌ - సాంబ - కాలియా వంటి వాళ్లు చాలామంది ఉన్నార‌ని రాహుల్ ఎద్దేవా చేశారు. అవినీతిపరులైన గాలి బ్రదర్స్ కు అత్యంత సన్నిహితులైన 8 మందికి టికెట్లు ఇచ్చారని, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పపై చీటింగ్‌ - అవినీతి - ఫోర్జరీ వంటి 23 కేసులున్నాయని రాహుల్ అన్నారు. దాంతో పాటు బీజేపీలోని 11మంది అగ్రనేతల అవినీతిపై 5 నిమిషాల పాటు ప్ర‌సంగించ‌గ‌ల‌రా అంటూ మోదీకి రాహుల్ స‌వాల్ విసిరారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ వ్యాఖ్య‌ల‌పై అమిత్ షా స్పందించారు. గాలి స‌న్నిహితులు - య‌డ్యూర‌ప్ప‌కు వ్య‌తిరేకంగా పెండింగ్ కేసులు లేవ‌ని - అందుకే వారికి టికెట్లు ఇచ్చామ‌ని స‌మ‌ర్థించుకున్నారు. అయితే, గాలి - య‌డ్యూర‌ప్ప గ్యాంగ్ లోని అభ్య‌ర్థుల‌పై ఉన్న పెండింగ్ కేసుల జాబితాపై ఓ ఆంగ్ల దిన‌పత్రిక ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని వెలువ‌రించింది. వారిపై ఎన్నెన్ని కేసులున్నాయో తెలియ‌జేస్తూ స‌వివ‌రంగ క‌థ‌నం ప్ర‌చురించింది.

బీజేపీ త‌ర‌ఫున క‌ర్ణాట‌క ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌బోతోన్న అభ్య‌ర్థుల కేసుల చిట్టా బట్ట‌బ‌య‌లైంది. గాలి జ‌నార్థ‌న్ రెడ్డి సోద‌రుడు సోమ శేఖ‌ర్ రెడ్డి(5) - శ్రీ‌రాములు(3) - టీహెచ్ సురేష్ బాబు(6) - క‌ట్టా సుబ్ర‌మ‌ణ్య‌నాయుడు(4) - సీటీ ర‌వి(3) -  మురుగేష్ నిరానీ(2) - కృష్ణ‌య్య‌(4) - శివ‌య్య జీ నాయక్(3) - ఆర్ అశోక్(2) - శోభా కరండ్లాజే(1)....ల కేసుల చిట్టా విడుద‌లైంది. వీరంతా క‌ర్ణాట‌క ఎన్నిక‌లలో బీజేపీ త‌ర‌ఫున పోటీచేస్తున్నారు. ఇక క‌ర్ణాట‌క‌లో బీజేపీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి య‌డ్యూర‌ప్ప‌పై ఏకంగా 23 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వీరి కేసుల చిట్టా బ‌హిరంగంగా బ‌య‌ట‌ప‌డ్డా కూడా....అమిత్ షా వారిపై కేసులు లేవ‌ని చెప్ప‌డం హాస్యాస్పదం. షాతో పోలిస్తే మోదీ...కొంత‌వ‌ర‌కు న‌యం. యడ్యూరప్పపై కేసులున్న మాట వాస్త‌వ‌మేన‌ని....అయితే, అవ‌న్నీ తప్పుడు కేసుల‌ని మోదీ తాజాగా ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా, రాహుల్ ...అవినీతిప‌రుడ‌ని - అత‌డిపై కేసులున్నాయ‌ని మోదీ వ్యాఖ్యానించ‌డం హాస్యాస్పదం.

తామంతా నీతిప‌రుల‌మ‌ని - గ‌ప్పాలు కొట్టుకునే బీజేపీ...గాలి బ్ర‌ద‌ర్స్ ను ఎందుకు ఎంక‌రేజ్ చేసింద‌నేది స‌మాధానం లేని ప్ర‌శ్న‌. వారిపై కేసులున్నాయ‌న్న విష‌యాన్ని అంగీక‌రించేందుకు అమిత్ షా సిద్ధంగా లేక‌పోవ‌డం హాస్యాస్పదం. కేసులున్న నేత‌ల‌తోపాటు 2012లో క‌ర్ణాట‌క అసెంబ్లీలో అశ్లీల దృశ్యాలు చూస్తూ దొరికిపోయిన ముగ్గురు క‌ళంకిత మంత్రుల‌కు కూడా 2018 ఎన్నిక‌ల్లో బీజేపీ అధిష్టానం టికెట్లు కేటాయించ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు తాము పెద్ద‌పీట వేస్తామ‌ని బాకా ఊదే బీజేపీ....ఈ పోర్న్ మంత్రుల‌కు టిక్కెట్లు ఇవ్వ‌డంపై వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. అదీగాక‌, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో...మ‌రోసారి మోదీ త‌న అమ్ములపొదిలో ఉన్న ప్ర‌ధానాస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు. ద‌ళిత రాష్ట్ర‌ప‌తి కోవింద్ కు సోనియా ఫోన్ చేయ‌లేద‌ని....ధీరవనిత ఓబవ్వను హత్యచేసిన టిప్పు జయంతి నిర్వహిస్తూ ఈ భూమిని, చరిత్రను, ప్రజలను కూడా కాంగ్రెస్‌ అవమానించిందని నీచ‌రాజ‌కీయాల‌కు  పాల్ప‌డేందుకు కూడా బీజేపీ వెనుకాడ‌డం లేదు. గ‌తంలో గుజ‌రాత్ లో కూడా గ‌డ్డు ప‌రిస్థితులను ఎదుర్కొంటోన్న స‌మ‌యంలో బీజేపీ ఇదే అస్త్రాన్ని వాడి విజ‌యం సాధించింది. అయితే, ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మోదీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్న నేప‌థ్యంలో ఈసారి క‌ర్ణాట‌క‌లో బీజేపీ విజయం న‌ల్లేరుపై న‌డ‌క కాద‌ని చెప్ప‌వ‌చ్చు.
Tags:    

Similar News