గత ఏడాది శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై 6 నెలలపాటు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. పరిపూర్ణానంద బహిష్కరణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ - రాజాసింగ్ లతో పాటు పలువురు వ్యతిరేకించారు. స్వామి బహిష్కరణ ప్రభుత్వ కుట్ర అని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. పరిపూర్ణానందను బహిష్కరించడం అంటే హిందువులను బహిష్కరించడమే అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో నేడు పర్యటించిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా...పరిపూర్ణానంద బహిష్కరణను తీవ్రంగా ఖండించారు. ఆర్ ఎస్ ఎస్ - వీహెచ్ పీ నేతలతో సమావేశమైన అమిత్ షా దగ్గర పరిపూర్ణానంద నగర బహిష్కరణ అంశం ప్రస్తావనకు రావడంతో ....ఆ విషయంపై షా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. స్వామిజీకి హిందువులంతా ఏకమై పరిపూర్ణ మద్దతివ్వాలని షా పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది.
స్వామి బహిష్కరణ విషయంలో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు వెనుకడుగు వేయవద్దని షా చెప్పినట్లు తెలుస్తోంది. శ్రీరాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మహేష్ కు శిక్ష విధించాలని షా అన్నట్లు సమాచారం. పరిపూర్ణానందను ఏ కారణంతో నగర బహిష్కరణ చేస్తారని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు, రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీతో పొత్తు ఉండదని, అన్ని స్ధానాల్లోనూ ఒంటరిగానే బరిలో దిగుతామని షా చెప్పినట్లు తెలుస్తోంది. `విశిష్ట సంపర్క్ అభియాన్ `లో భాగంగా తెలంగాణలోని పలువురు రాజకీయ - సినీ - పారిశ్రామిక ప్రముఖులను షా కలిశారు.
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలలో బైక్ యాత్రలు చేపట్టాలని కార్యకర్తలకు షా ఆదేశించారు. పార్టీలో కార్యకర్తలు, నేతలను చేర్చుకోవాలని రాజకీయేతర రంగాల్లో పేరున్న వారిని కూడా పార్టీలోకి ఆకర్షించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే రామోజీరావుతో షా భేటీ అయినట్లు తెలుస్తోంది.