పార్టీ ప‌రువు తీశారంటూ ఫైర్ అయిన అమిత్ షా

Update: 2017-08-01 10:37 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అస‌లే రాజ్య‌స‌భ‌లో మెజార్టీ లేక ప్ర‌భుత్వం స‌త‌మ‌త‌మ‌వుతున్న స‌మ‌యంలో 30 మంది ఎంపీలు డుమ్మా కొట్ట‌డం వ‌ల్ల రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లులో ప్ర‌తిప‌క్షాలు సూచించిన కీల‌క స‌వ‌ర‌ణ‌ల‌ను కూడా ఆమోదించే ప‌రిస్థితి ఏర్ప‌డింది. సోమ‌వారం రాజ్య‌స‌భ‌లో బీసీ క‌మిష‌న్‌కు రాజ్యాంగబ‌ద్ధ సంస్థ హోదా క‌ల్పించే బిల్లుకు ఆమోదం సంద‌ర్భంగా 30 మంది బీజేపీ ఎంపీలు గైర్హాజ‌రైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌కు కీల‌క స‌మ‌యంలో డుమ్మా కొట్టి ప్ర‌భుత్వాన్ని ఇబ్బందుల్లో ప‌డేసిన ఎంపీలు, కొంద‌రు మంత్రుల‌పై బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా సీరియ‌స్ అయ్యారు. ప్ర‌తివారం పార్ల‌మెంటేరియ‌న్ల‌తో నిర్వ‌హించే స‌మావేశంలో భాగంగా ఎంపీల‌పై ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు.

డుమ్మా కొట్టిన‌ ఎంపీలంద‌రితో తాను ప్ర‌త్యేకంగా మాట్లాడతాన‌ని అమిత్ షా స్ప‌ష్టంచేశారు. ప్ర‌జాస్వామ్యంలో ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని, ఇది ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతం పంపిస్తుంద‌ని షా అన్నారు. గ‌త వార‌మే ప్ర‌ధాని మోడీ కూడా ఎట్టిప‌రిస్థితుల్లోనూ పార్ల‌మెంట్‌కు డుమ్మా కొట్ట‌కూడ‌ద‌ని ఎంపీల‌కు గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. ప్ర‌భుత్వ బిల్లుల‌ను పాస్ చేసే బాధ్య‌త ట్రెజ‌రీ బెంచ్‌ల‌పైనే ఉంటుంద‌ని మోడీ అన్నారు. ముఖ్యంగా లంచ్ త‌ర్వాత ఎంపీలు క‌నిపించ‌కుండా పోతున్నార‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఇవాళ స‌మావేశానికి మోడీ హాజ‌రుకాక‌పోయినా.. రాజ్య‌స‌భ‌కు డుమ్మా కొట్టిన అంద‌రి పేర్లు త‌న‌కు కావాల‌ని నిన్న రాత్రే ప్ర‌ధాని ఆదేశించారు. క‌చ్చితంగా స‌భ‌కు హాజ‌రు కావాల‌ని పార్టీ విప్ జారీ చేసినా.. 30 మంది డుమ్మా కొట్ట‌డం ప్ర‌భుత్వానికి చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. 123 రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా బీసీ క‌మిష‌న్‌కు రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ హోదా క‌ల్పించారు.

 బీసీ క‌మిష‌న్‌ను చ‌ట్ట‌బ‌ద్ధ సంస్థ హోదా నుంచి రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ‌గా మార్చ‌డానికి ఈ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఇది ఆమోదం పొంద‌డానికి స‌భ‌లో మూడింట రెండొంతుల మెజార్టీ అవ‌స‌రం. రాజ్య‌స‌భ‌లో స‌వ‌ర‌ణ‌ల‌తో ఆమోదం పొందిన బిల్లు మ‌రోసారి లోక్‌స‌భ‌కు వెళ్ల‌నుంది. బీసీ క‌మిష‌న్‌కు రాజ్యాంగ‌బ‌ద్ధ సంస్థ హోదా వ‌చ్చిందంటే అది కోర్టుతో స‌మానం. బీసీల‌పై ఏవైనా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, వివ‌క్ష కేసుల్లో బాధ్యుల‌కు నేరుగా స‌మ‌న్లు జారీ చేయ‌డంతోపాటు విచార‌ణ‌కు కూడా ఆదేశించవ‌చ్చు. ఇంత ప్రాధాన్య‌త ఉన్న ఈ బిల్లు ఓటింగ్ సంద‌ర్భంగా 30 మంది ఎంపీలు డుమ్మా కొట్ట‌డంతో.. చివ‌ర్లో కాంగ్రెస్ స‌భ్యులు దిగ్విజ‌య్‌ - బీకే హ‌రిప్ర‌సాద్‌ - హుస్సేన్ దాల్వాయ్ సూచించిన స‌వ‌ర‌ణ కూడా పాస్ అయింది. క‌మిష‌న్‌ లో ఉండే ఐదుగురు స‌భ్యులు ఓబీసీకి చెందిన‌వాళ్లే ఉండాల‌ని, అందులో ఒక‌రు మ‌హిళ‌, మ‌రొక‌రు మైనార్టీకి చెందిన‌వాళ్లు ఉండాల‌న్న‌ది ఆ స‌వ‌ర‌ణ‌. దీన్ని ప్ర‌భుత్వం వ్య‌తిరేకించ‌డంతో ఓటింగ్ నిర్వ‌హించారు. త‌గినంత బ‌లం ప్ర‌భుత్వానికి లేక‌పోవ‌డంతో ఈ స‌వ‌ర‌ణ కూడా పాస్ అయింది.

Tags:    

Similar News