సతీసమేతంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న అమిత్ షా...!

Update: 2021-08-12 12:30 GMT
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించున్న అనంతరం అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా,  స్వామి వార్ల దర్శనానికి వచ్చిన హోం మంత్రి అమిత్‌షాకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ వాణి మోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆలయ అర్చకస్వాములు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంతరం హోంమంత్రి అమిత్ షా కుటుంబసభ్యులతో స్వామివార్లను దర్శించుకున్నారు. స్వామి వార్ల దర్శన అనంతరం ఆలయ అధికారులు మల్లికార్జున స్వామి అమ్మవార్ల చిత్ర పటాన్ని బహూకరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీలో పర్యటించబోతున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ లోని బేగం పేట్ ఎయిర్ పోర్టుకు వచ్చి అక్కడి నుంచి ఏపీలోని శ్రీశైలానికి ప్రత్యేక విమానంలో రాబోతున్నారు. మధ్యాహ్నం 12.40 నుంచి 1.40 గంటల మధ్య ఆయన కుటుంబసభ్యులతో భ్రమరాంబదేవి, మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకోనున్నారు. అనంతరం భ్రమరాంబిక గెస్ట్‌హౌస్‌కు చేరుకుని భోజనం చేస్తారు. తర్వాత 2.40కి శ్రీశైలం నుంచి బయలుదేరి బేగంపేట వెళతారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోనున్నారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీతో పాటు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ కలిసి పనిచేసిన చరిత్ర లేకపోయినా సుదీర్ఘ అనుబంధం ఉందనేలా ప్రతీ విషయంలోనూ జగన్ బీజేపీకి అండగా నిలిచారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు పార్లమెంటులో కీలక బిల్లుల విషయంలోనూ జగన్ బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. పలుమార్లు అడగకపోయినా ఎన్డీయే వైఖరికి జాతీయ స్ధాయిలో మద్దతు కూడా ఇచ్చారు

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత రెండేళ్లకు పైగా కేంద్రంలోని బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ ఏ విషయంలోనూ లబ్ది చేకూరలేదు. ఏపీకి గతంలో ఇచ్చిన విభజన హామీలతో పాటు ఆర్ధిక సాయం విషయంలోనూ కేంద్రం నుంచి మొండిచేయి ఎదురవుతోంది. అదే సమయంలో రాష్ట్రంలోనూ మత పరమైన వివాదాల్ని తెరపైకి తెస్తూ బీజేపీ జగన్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

 ఇన్నాళ్లూ బీజేపీ చెప్పినట్టల్లా ఆడుతూ.. ఏపీకి గతంలో కేంద్రం ఇచ్చిన హామీల్ని గుర్తు చేయడానికే పరిమితమైన జగన్, తాజాగా తన స్టాండ్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అసహనంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ తాజాగా తన వైఖరి మార్చుకున్నట్లు అర్ధమవుతోంది. ఈ మధ్య జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులకు బీజేపీపై ఎదురుదాడి చేయాలని సంకేతాలు ఇచ్చిన జగన్.. త్వరలో బీజేపీకి మరిన్ని షాకులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ఏపీకి వస్తున్నా వైసీపీ పట్టించుకునే పరిస్ధితుల్లో లేదు.
Tags:    

Similar News