అన్నాడీఎంకేకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారే!

Update: 2017-06-28 04:27 GMT
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఇప్పుడు శూన్యం ఆవ‌రించింద‌ని చెప్ప‌డానికి - త‌మిళ తంబీలు ఇప్పుడు జాతీయ పార్టీల వ‌ద్ద త‌లొంచార‌ని చెప్పేందుకు మ‌రో ప‌క్కా నిద‌ర్శ‌నం ల‌భించింది. మొన్న‌టిదాకా త‌మిళ‌నాడులో ఏ ఒక్క జాతీయ పార్టీకి కూడా ఆద‌ర‌ణ ద‌క్క‌ని ప‌రిస్థితి. ఓ సారి డీఎంకేకు అధికారం దక్కితే... మ‌రో ప‌ర్యాయం అన్నాడీఎంకేకు పాల‌నా ప‌గ్గాలు అందుతాయి. ఇది మొన్న‌టిదాకా అక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితి. ఈ ప‌రిస్థితిని కొంతైనా ప్ర‌భావితం చేయ‌డ‌మే కాకుండా త‌మిళ నేల‌లో పాదం మోపుదామంటూ అటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో పాటు ఇటు భార‌తీయ జ‌న‌తా పార్టీ చేసిన య‌త్నాల‌న్నీ బెడిసికొట్టాయి. డీఎంకే పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి అక్క‌డ కొద్దో గొప్పో సీట్లు ద‌క్కాయి గానీ... బీజేపీకి అయితే అస‌లు అక్క‌డ కాలు మోపేంత వెసులుబాటు కూడా ల‌భించ‌లేదు. ఇక కాంగ్రెస్ పార్టీకి సీట్లు ద‌క్కినా... అక్క‌డి ప్ర‌భుత్వాన్ని ప్ర‌భావితం చేయ‌డం ఆ పార్టీకి సాధ్య‌మే కాలేదు.

అయితే అన్నాడీఎంకే అధినేత్రి - దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. జ‌య మ‌ర‌ణంతో రాజ‌కీయ శూన్యం ఏర్ప‌డ్డ అక్క‌డి ప‌రిస్థితుల‌ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకునేందుకు రంగంలోకి దిగిపోయింది. ఈ క్ర‌మంలో శ‌శిక‌ళతో మంత‌నాలు సాగించిన క‌మ‌ల‌నాథులు... త‌మ‌కు ప‌న్నీర్ సెల్వం అయితేనే ప‌ని అవుతుంద‌ని భావించి... జ‌య మ‌ర‌ణంతో ఖాళీ అయిన సీఎం పోస్టులో ఓపీఎస్‌ ను కూర్చోబెట్టారు. అయితే ఈ ప‌రిణామాన్ని జీర్ణించుకోలేని శ‌శిక‌ళ‌... ప‌న్నీర్‌ ను దించేసి త‌న‌కు అనుకూలంగా ఉన్న పళ‌నిస్వామికి పీఠం అప్ప‌గించారు. తొలుత తానే ఈ సీటులో కూర్చోవాల‌ని శ‌శిక‌ళ య‌త్నించ‌గా... ఆ య‌త్నాన్ని ముందే ప‌సిగ‌ట్టిన బీజేపీ ఆమెపై పాత కేసుల‌ను తిర‌గ‌దోడింది. ఫ‌లితంగా జ‌య జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌లేదు.

ఈ క్ర‌మంలో ప‌న్నీర్ సెల్వం ఓ వ‌ర్గంగా ఏర్ప‌డితే... ప‌ళ‌నిస్వామి కూడా మ‌రో వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక శ‌శిక‌ళ మేన‌ల్లుడు - పార్టీ ఉప ప్ర‌ధాన కార్య‌దర్శి టీవీవీ దిన‌క‌ర‌న్ కూడా మ‌రో వ‌ర్గాన్ని ఏర్ప‌ర‌చుకున్నాడు. ఇలా అన్నాడీఎంకే ఇప్పుడు మూడు ముక్క‌లైపోయింది. త‌న‌కు అంత‌గా కొరుకుడు ప‌డ‌ని  డీఎంకేకు గ‌ట్టి పోటీగా నిలిచిన అన్నాడీఎంకేలో ఈ గ్రూపులు ఏర్పాటు కావ‌డం బీజేపీని క‌ల‌వ‌రానికి గురి చేసింద‌ని చెప్పాలి. దీంతో నిన్న త‌మిళ‌నాడు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు ఆ వ‌ర్గాల‌ను ఒక్క ద‌రికి చేర్చేందుకు త‌న వంతు య‌త్నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న దూత‌ల‌తో మూడు వ‌ర్గాల‌కు సందేశాలు పంపించార‌ట‌.

ఈ సందేశాల సారాంశం తెలిసిన మూడు వ‌ర్గాలు కూడా ఆశ్చ‌ర్య‌పోవ‌డంతో పాటు ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో ఏమీ మాట్లాడలేమంటూ లోలోప‌లే మ‌ద‌న‌డ్డాయ‌ట‌. అయినా అమిత్ షా సందేశాల్లోని సారాంశం ఏమిటంటే... *మూడు వ‌ర్గాలు ఉన్న‌ప‌ళంగా క‌లిసిపోవాలి. అలా క‌వ‌ల‌కుంటే మీ మ‌నుగ‌డ‌కే ముప్పు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా విలీనం కావాల్సిందే. లేదంటే స‌హించేది లేదు. మీకు మీరుగా విలీనం కాకుంటే నేరుగా నేనే రంగంలోకి దిగాల్సి వ‌స్తుంది* అని అమిత్ షా మూడు వ‌ర్గాల‌కు ఘాటైన హెచ్చ‌రిక‌లే జారీ చేశార‌ట‌. మ‌రి ఈ హెచ్చ‌రిక‌ల‌కు ఆ మూడు వ‌ర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News