అమితాబ్ మాటలు మన నాయకుల గురించేనా?

Update: 2016-06-02 06:33 GMT
ప్ర‌స్తుత కాలంలో ప్ర‌చారం కోరుకోని వారుండరు. అయితే అలా పాపులారిటీని ఎంజాయ్ చేసే వారు త‌మ గురించి కాస్త అటూ ఇటూగా వార్త‌లు వెలువ‌డితే త‌ట్టుకోలేరు. ఏకంగా విమ‌ర్శ‌లు మొద‌లు పెడ‌తారు. ఇందులో రాజ‌కీయ నాయ‌కులు - సినీనటులు ప్ర‌ముఖ స్థానంలో ఉంటారు. అయితే కొంద‌రు పెద్దలు త‌మ ఉదాత్త‌మైన‌ ఆలోచ‌న‌ను ఏ విధంగా చాటుకుంటార‌నేందుకు బిగ్‌ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ నిద‌ర్శ‌నం. ఆయ‌న మాట‌లు సెల‌బ్రిటీల‌కు చెంప‌పెట్టు వంటిదే కాదు ఒకింత మార్గ‌ద‌ర్శకం కూడా.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ రెండేళ్ల పాల‌న సంద‌ర్భంగా చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో బిగ్‌ బీ భాగ‌స్వామ్యం పంచుకోవ‌డం వివాదాస్పదంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీనిపై  తాజాగా ఓ ప‌త్రిక‌తో అమితాబ్ బ‌చ్చ‌న్ మాట్లాడారు. సెల‌బ్రిటీలు అన్న త‌ర్వాత అన్నింటినీ హుందాగా స్వీక‌రించాల‌ని చెప్పారు. త‌మ‌కు కీర్తి వ‌చ్చిన‌పుడు పొంగిపోయి విమ‌ర్శ‌ల స‌మ‌యంలో ఆ విధంగా చేశారేంట‌ని కుంగిపోవ‌డం స‌రికాద‌న్నారు. సెల‌బ్రిటీల తీరు గురించి ప్ర‌స్తావిస్తూ... #మీ కోసం కేకలు వేసి.. అరిచి.. ప్రశంసలు గుప్పించినప్పుడు వాటిని ఆనందంగా స్వీకరించి.. విమర్శలు వచ్చినప్పుడు 'మాపై ఇటుకలు వేయకండి' అని అనడం సరికాదు. ఇలాంటి సంద‌ర్భాలు ఒక చాలెంజ్ వంటివి. వాటిని హుందాగా స్వీకరించాలి. ఎవరూ పరిపూర్ణులు కారు. అంతా తప్పులు  చేస్తారనే భావ‌న‌ను అల‌వ‌ర్చుకొని ప‌ట్టించుకోకుండా ముందుకువెళ్లాలి# అని హిత‌బోధ చేశారు.

ఇలా మాట‌లు చెప్పేందుకు తన‌కు ఉన్న అర్హ‌త‌ను కూడా బిగ్‌బీ వివ‌రించారు. గ‌తంలో త‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌పుడు  వాటిని హుందాగా స్వీకరించాన‌ని తెలిపారు. త‌న వ్య‌వ‌హార‌శైలిని నుంచి మొద‌లుకొని దుస్తుల వ‌ర‌కు విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌పుడు వాటిని సానుకూలంగానే స్వీక‌రిస్తాన‌ని బ‌చ్చ‌న్‌ చెప్పారు. ఇదే త‌ర‌హా ఆలోచ‌న తీరును మిగ‌తా నాయ‌కులు కూడా అల‌వ‌ర్చుకుంటే అన‌వ‌స‌ర వివాదాలు రావేమో క‌దా.
Tags:    

Similar News