వైఎస్ ఆర్ కాంగ్రెస్ గూటికి ఆనం

Update: 2018-07-14 11:42 GMT
ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌కీయాల‌లో సీనియ‌ర్ నాయ‌కుడు - మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఖ‌రారైంది. పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి - ఆయ‌న అన్న కుమారుడు రంగ‌మ‌యూరి రెడ్డి లోట‌స్ పాండ్ లో ఏకాంతంగా స‌మావేశ‌మ‌య్యారు. తాను బేష‌ర‌తుగానే పార్టీలో చేర‌తాన‌ని - అయితే త‌న సోద‌రుని కుమారుని భవిష్య‌త్ రాజ‌కీయాల‌కు మీరు హామీ ఇవ్వాలంటూ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి పార్టీ అధినేత జ‌గ‌న్ ను కోరిన‌ట్లు స‌మాచారం. దీంతో ఆనం చేరిక‌పై ఇన్నాళ్లూ కొన‌సాగిన స‌స్పెన్స్‌ కు తెర‌ప‌డిప‌న‌ట్లు అయ్యింది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కొన్నాళ్లు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న రామ‌నారాయ‌ణ రెడ్డి ఆ త‌ర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే అక్క‌డ ఆయ‌న‌కు పొస‌గ‌లేదు. దీంతో అక్క‌డి నుంచి వెలుప‌లికి వ‌చ్చేశారు. జిల్లాలో ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌న్న‌ది ఆనం  ఆలోచ‌న‌. అలాగే త‌న సోద‌రుని కుమారుడు రంగ‌మ‌యూరి రెడ్డిని నెల్లూరు సిటీ కాని - రూర‌ల్ నుంచి బ‌రిలో దింపాల‌ని ఆయ‌న భావించారు. ఆత్మ‌కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మేక‌పాటి గౌతంరెడ్డి ఇందుకు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఆనం చేరిక వాయిదా ప‌డింది.

జ‌గ‌న్ ను క‌లిసిన ఆనం త‌న‌కు ఎటువంటి ప‌ద‌వుల గురించి అడ‌గ‌లేద‌ని - తాను బేష‌ర‌తుగానే పార్టీలో చేర‌తాన‌ని అన్న‌ట్లు స‌మాచారం. దీనికి వై.ఎస్.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంగీక‌రించడంతో ఆనం చేరిక ఇక లాంఛ‌న‌మే. జిల్లాలో ఆనం కుటుంబానికి రాజ‌కీయంగా మంచి ప‌లుకుబ‌డి ఉంది. ఆ కుటుంబం ప‌ట్ల జిల్లాలో వంద‌ల కుటుంబాలు విశ్వాసం చూపిస్తాయి. నేరుగా ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌క‌పోయినా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ త‌మ‌కు మంచి గుర్తింపు ఇస్తారని ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెబుతున్నారు. జ‌గ‌న్ తండ్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర రెడ్డికి - త‌ల్లి విజ‌య‌మ్మ‌కు కూడా ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి స‌న్నిహితంగా మెలిగే వారు. ఇది ఆయ‌న‌కు పార్టీలో క‌లిసి వ‌చ్చే అంశం.

ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి చేరిక‌తో నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డిన‌ట్లు అయ్యింది. అక్క‌డ అధికార తెలుగుదేశం పార్టీకి - ప్ర‌తిప‌క్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డుస్తుంది. ఇప్పుడు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి పార్టీ మారి వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ లో చేరుతూండ‌డంతో అధికార తెలుగుదేశం పార్టీకి గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిన‌ట్లు అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కూ జిల్లా రాజ‌కీయాలు ఒక విధంగానూ ఇక మీద‌ట మ‌రో విధంగానూ ఉండ‌బోతున్నాయ‌ని జిల్లా నాయ‌కులు చెబుతున్నారు.
Tags:    

Similar News