బొండా, బొజ్జల, జ్యోతుల... నెక్స్టేంటి?

Update: 2017-04-02 05:59 GMT
మంత్రి వర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీలో విభేదాలను, అసంతృప్తులను బహిర్గతం చేసింది. మంత్రి పదవి నుంచి తప్పించారని ఒకరు... తనకు ఎలాగైనా సరే పదవి ఇవ్వాల్సిందేనని ఇంకొకరు.. మంత్రి పదవి ఇస్తామన్న హామీ వల్లే వైసీపీ నుంచి ఫిరాయించినా ఫలితం లేకపోయిందని ఇంకొకరు... ఫిరాయించి వచ్చిన తన ప్రత్యర్థికి పదవి ఇస్తారా అని మరొకరు.. ఇలా టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహాలతో రగిలిపోతున్నారు. సొంత గూటికి వెళ్లిపోవాలని... కొత్త పార్టీ పవన్ తో కలిస్తే ఎలా ఉంటుందో అని.. ఇలా పరిపరివిధాలా ఆలోచిస్తూ నెక్స్టేంటి అని ప్లాన్లు గీసుకుంటున్నారు.
    
మంత్రి పదవి నుంచి వైదొలగమన్నందుకు అలిగిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన ఇప్పటికిప్పుడు పార్టీ మారే అవకాశాలు లేకపోయినా.. విపక్ష వైసీపీ వైపు ఆయన మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డికి సీటు  ఇస్తే ఆ కుటుంబం వైసీపీలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
    
మంత్రివర్గ విస్తరణలో తప్పని సరిగా అవకాశం ఉంటుందని భావించిన బొండా ఉమ తనను పరిగణనలోనికి తీసుకోకపోవడంతో అలిగారు. పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఎంపి కేశినేని నాని ఆయనను బుజ్జగిస్తున్నట్లు సమాచారం.  ఈయన కూడా టీడీపీలో ఎదుగుదల చూసుకుంటూనే మరోవైపు ప్రత్యామ్నాయాలపై కన్నేసిన కేండిడేట్. ఇప్పటికే ఆయన పవన్ కళ్యాణ్ పార్టీ సంగతేంటా అని విశ్లేషించుకుంటున్నారట. అయితే.. మంత్రి పదవి వస్తుందని గట్టిగా ఆశ పెట్టుకుని తన మనోభీష్ఠం బయటపడకుండా ఉన్నారు. కానీ.. ఇప్పుడు పదవి రాకపోవడంతో ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్లు టాక్.
    
ఇకపోతే... తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జ్యోతుల నెహ్రూ కూడా తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. సీనియర్ నేతనైన తనను పరిగణనలోనికి తీసుకోకపోవడం పట్ల ఆయన మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలోనికి తాను వచ్చిందే మంత్రి పదవి హామీతోనని ఆయన తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఈయన మళ్లీ సొంత గూటికి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
    
మరో వైపు కడప జిల్లా కు చెందిన ఆదినారాయణ రెడ్డికి మంత్రిపదవి విషయంలో రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News