జేసీబీతో మహమ్మారి రోగి అంత్య‌క్రియ‌లు...జ‌గ‌న్ స‌ర్కారు కన్నెర్ర‌

Update: 2020-06-27 03:30 GMT
శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్‌ కారణంగా మరణించిన వ్యక్తిని అంత్యక్రియలు విషయంలో అమానవీయంగా వ్యవహరించిన ఉదంతం ప‌లువురిని క‌లిచి వేసింది. మహమ్మారి వైరస్ సోకి మృతి చెందిన ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడం స్థానికులు కూడా ససేమిరా అనడంతో ఆ మృతదేహానికి అధికారులే అంత్యక్రియలు చేశారు. అయితే, ఈ సంద‌ర్భంలో వారు వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదాస్ప‌దంగా మారింది. పొక్లెయిన్ ద్వారా మృతదేహాన్ని తరలించి అంత్య‌క్రియ‌లు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పెద్ద ఎత్తున దుమారం రేగిన నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కార్యాల‌యం స్పందించింది. బాధితుల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకుంది.


పలాస మున్సిపాలిటిలోని ఓ మున్సిపల్ ఉద్యోగి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండ‌గా శుక్రవారం మృతి చెందాడు. అనంతరం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. మహమ్మారి పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్పటివరకూ ఆ మృతదేహం వద్దే ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆయ‌న అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. ప్ర‌భుత్వ అధికారులు రంగ ప్ర‌వేశం చేసి పీపీఈ కిట్లు ఇస్తామని, శానిటైజేషన్ చేస్తామని చెప్పినా వారి నుంచి స్పంద‌న రాక‌పోవ‌డంతో స్థానిక మున్సిప‌ల్‌ అధికారులు స్పందించి అంత్య‌క్రియ‌ల ఏర్పాట్లు చేశారు. అయితే, ఆయ‌న మృతదేహాన్ని జేసీబీలో శ్మశానానికి తరలించారు. దీనిపై పెద్ద ఎత్తున‌ విమర్శలు వెల్లువెత్తాయి. మీడియాలోనూ ఈ వార్త హ‌ల్ చ‌ల్ చేసింది.

మహమ్మారి రోగి ప‌ట్ల అమానవీయంగా వ్యవహరించిన ఘటన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో సీఎంఓ అధికారులు మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉన్నప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించి పొక్లెయిన్ ద్వారా మృతదేహాన్ని తరలించడం అమానవీయమని స్పష్టం చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన జిల్లా కలెక్టర్‌ నివాస్, పలాస మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్‌ సోకిన వారి విషయంలో వివక్ష లేకుండా, అమానవీయ చర్యలకు దిగకుండా వైద్యారోగ్యశాఖ ఇదివరకే స్పష్టమైన నిబంధనలను జారీచేసిందని ఈ సందర్భంగా ప్రభుత్వం మరోసారి గుర్తుచేసింది.
Tags:    

Similar News