మోడీతో సూపర్ హిట్ కాంబినేషన్ అంటూ బాబు !
మోడీ చంద్రబాబు పవన్ లది సూపర్ హిట్ కాంబినేషన్ గా విశాఖ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు.
మోడీ చంద్రబాబు పవన్ లది సూపర్ హిట్ కాంబినేషన్ గా విశాఖ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. ఈ కాంబో కలిసింది అంటేనే సూపర్ హిట్ అందులో రెండవ మాటే లేదని అన్నారు. ఈ కాంబో రిపీట్ అయి తీరుతుందని ఆయన మోడీ సాక్షిగా సభలో చెప్పారు.
అంటే మళ్ళీ ఎన్నికలు జరిగినా కూటమి ద్వారా ఈ మూడు పార్టీలు ప్రజల వద్దకు వచ్చి తీర్పు కోరుతాయన్న మాట. పొత్తుల విషయంలో ఒకే ఎన్నిక వరకూ పరిమితం అవుతారు అని అంతా అనుకున్నా అది కాదు అని గెలిచిన మరుక్షణం నుంచి బాబు చెబుతూనే ఉన్నారు. ఇపుడు ఆయన మోడీ సమక్షంలోనే ఎన్డీయే బంధానికి మరిన్ని ముడులు వేసి ఇది ఇంకా గట్టిది అని నిరూపించారు.
అంతే కాదు తమకు మోడీయే స్పూర్తి అని కూడా చెప్పారు. మోడీ సహకారంతో ఏపీని తాము అద్భుతంగా తీర్చిదిద్దుకుంటామని అన్నారు. అభివృద్ధికి మారు పేరు మోడీ అన్నారు. మోడీ ప్రపంచ నాయకుడు అని కితాబు ఇచ్చారు. మోడీని ఉద్దేశించి నేరుగా ఆయన ఆంగ్లంలో చేసిన సంభాషణ కూడా సభలో అందరినీ ఆకట్టుకుంది. బాబు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఫుల్ జోష్ లో విశాఖ సభలో పాలు పంచుకున్నారు.
ఏపీ బాగుపడాలనే ఈ పొత్తు అని చెబుతూ వచ్చిన బాబు ఆ ఫలాలు ఫలితాలు ఇపుడు కళ్ళ ముందు కనిపిస్తూంటే తాము ఎంతటి సక్సెస్ ఫుల్ జోడీయో జనం సాక్షిగానే చెప్పించారు. మోడీ సైతం బాబు ఉత్సాహంగా చేసిన స్పీచ్ ని అలా వింటూ ఉండిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాబుని విజనరీ అని మోడీ అభివర్ణించడం కూడా గొప్ప విశేషంగా చూస్తున్నారు
ఇక మోడీ సైతం ఈ కూటమి మరింత కాలం కలిసికట్టుగా ఒకే జట్టుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నట్లుగా ఆయన ప్రసంగం తెలియచేస్తోంది. పవన్ కళ్యాణ్ సంగతి సరే సరి. ఏపీ అభివృద్ధికి నోచుకుంది అంటే అది కచ్చితంగా మోడీ బాబు జోడీ వల్లనే అని వేదిక మీద ఆయన చెప్పేశారు.
అయిదేళ్ల పాటు సాగిన విధ్వంసం తరువాత ఇంతటి ప్రగతిని చూస్తామని ఎవరూ అనుకోలేదని అదంతా మోడీ బాబు ల గొప్పతనమే అని పవన్ అన్నారు. తామంతా కలసి ప్రజలకు మరిన్ని మేళ్ళను చేస్తామని ఆయన నారసిం హుడి సాక్షిగా హామీ ఇచ్చారు. మొత్తానికి ఎన్డీయే కూటమిలోని ఈ ముగ్గురు మిత్రులూ త్రిమూర్తులు మాదిరిగా విశాఖ వేదిక మీద కనిపించడమే కాదు తమది అవ్యాజమైన అభిమానం అనుబంధమని ఏపీ కోసం జట్టు కట్టిన ఈ చేతులు ఎన్నటికీ విడిపోవని బహు గొప్ప సందేశం ఇచ్చేశారు.