ఇక ఏపీ లో ఎప్పుడుపడితే అప్పుడు ఇసుక తవ్వకం కుదరదు

Update: 2019-10-14 08:01 GMT
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఇసుక పాలసీ సెప్టెంబర్ 5 నుంచి వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.. కొత్త విధి విధానాలు జారీ చేసింది. ఇసుక పాలసీ, ధరల నిర్ధారణ, 1966 చట్టంలో సవరణలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు తదితర అంశాలకు సంబంధించి జీవోలు జారీ చేసింది.

ఇసుకను రీచ్ ల నుంచి స్టాక్ యార్డులకు తరలించి ఏపీ ఎండీసీ అమ్మకాలు చేపడుతోంది. ఇసుక ధరను టన్నుకు రూ.375గా నిర్ణయించింది. అవినీతికి చాన్స్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆన్ లైన్ లోనే ఇసుక అమ్మకాలు, నగదు చెల్లింపులు జరగనున్నాయి. ప్రస్తుతానికి ఏపీలో 102 ఇసుక రీచ్ లను ప్రభుత్వం గుర్తించింది.

అయితే తాజాగా ఇసుక తవ్వకాల్లో అక్రమాలు - అవినీతి - దోపిడీని నియంత్రించడానికి జగన్ సర్కారు మరో కఠిన నిబంధనను తీసుకొచ్చింది. ప్రధానంగా అర్ధరాత్రి తర్వాత అందురు పడుకున్నాక.. అధికారుల నిఘా లేని సమయంలో తెల్లవారుజాము వరకు ఇసుకను తవ్వి అక్రమార్కులు దోచుకెళ్తున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో  ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే పగలు మాత్రమే ఇసుకను తరలించేలా జగన్ సర్కారు కొత్త నిబంధన తెచ్చింది. ఈ మేరకు ఇసుక తవ్వకాలకు మైనింగ్ అనుమతులు తప్పనిసరి అని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రకటించారు.

దీంతో రాత్రిళ్లు ప్రొక్లెయిన్లతో గుట్టు చప్పుడు కాకుండా ఇసుకను తరలించాలనుకునే అక్రమార్కులకు చెక్ పడనుంది. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఇసుక అక్రమ రవాణా ప్రధానంగా రాత్రిళ్లు చేసే వారికి పెద్ద దెబ్బగా పరిణమించింది.
Tags:    

Similar News