ఏపీ అధికారపక్షం.. ఆంధ్రా ద్రోహా?

Update: 2015-08-11 04:35 GMT
ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న రాజకీయం పట్ల విసుగు చెంది తిరుపతికి చెందిన ముని కోటి తనను తాను కాల్చుకొని.. తీవ్ర గాయాల నడుమ ఆసుపత్రి పాలై మరణించాడు. ఇప్పటివరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రత్యేక హోదా హామీ మరింతగా రాజుకుంది. మునిరాజు మృతికి నిరసనగా మంగళవారం ఏపీ బంద్ ను వామపక్షాలు ప్రకటించాయి.

వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు స్పందించి కాంగ్రెస్.. వైఎస్సార్ కాంగ్రెస్లతో పాటు.. ప్రత్యేక హోదా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా సాధన సమాఖ్య కూడా ఏపీ బంద్ చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న మొదటి బంద్ గా దీన్ని చెప్పాలి. ఈ బంద్ ను భారీ ఎత్తున నిర్వహించాలని విపక్షాలు నిర్ణయించాయి.

ఇదిలా ఉంటే.. విపక్షాలిచ్చిన బంద్ పిలుపునకు వివిధ వర్గాల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తోంది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మీదకు లారీ కనిపించే ప్రసక్తే లేదని ప్రకటిస్తే.. మరోవైపు బంద్ కు తమ మద్దతు ఉంటుందని ఏపీ ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ సైతం స్పందించింది. ఏపీ భవిష్యత్తు తరాల కోసం చేస్తున్న ఈ ఉద్యమానికి అందరూ సహకరించాలని కోరుతుంటే.. మరోవైపు హీరో శివాజీ మాత్రం.. మంగళవారం బంద్ లో పాల్గొనని వారంతా ఆంధ్రా ద్రోహులని పేర్కొన్నారు.

ఏపీ అధికారపక్షం.. వారి మిత్ర పక్షం మినహా మిగిలిన వారంతా ఒకే జత కట్టుకట్టటం ఒక విశేషమైతే.. ఏపీ ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తామని చెప్పే ఏపీ అధికారపక్షం మాత్రం.. ఏపీ బంద్ గురించి మాత్రం మాట వరసకు సైతం మాట్లాడని పరిస్థితి.

మరి.. హీరో శివాజీ చెప్పినట్లుగా మంగళవారం నిర్వహించే బంద్ లో పాల్గొనని వారంతా ఆంధ్రాద్రోహులని పేర్కొన్న మాట.. ఏపీ తమ్ముళ్లకు వినపడలేదా? లేక.. శివాజీ మాటను లైట్ తీసుకున్నారా? శివాజీని లైట్ తీసుకుంటే తీసుకోవచ్చు కానీ.. ఆంధ్రోళ్ల భావోద్వేగాలు తక్కువ చేస్తే మాత్రం అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న విషయం తమ్ముళ్లు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది.
Tags:    

Similar News