రాహుల్ తో కీలక భేటీలో.. 'ఆంధ్రజ్యోతి' ఆర్కే.. 'టీవీ5' నాయుడు

Update: 2022-05-07 07:49 GMT
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించేందుకు వచ్చిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. రోటీన్ కు కాస్తంత భిన్నంగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. వచ్చే ఏడాదిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యమన్నట్లుగా ఆయన అడుగులు పడుతున్నాయి.

వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ విజయవంతం కావటం.. వరంగల్ సభ సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వ్యవసాయానికి చాలా చేశామని చెప్పే కేసీఆర్ సర్కారు నోట మాట రాలేని విధంగా.. డిక్లరేషన్ లో ప్రస్తావించిన అంశాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. వరంగల్ సభను ముగించుకొన్న తర్వాత హెలికాఫ్టర్ లో హైదరాబాద్ కు చేరుకున్నారు. శుక్రవారం రాత్రి దాదాపు పదిన్నర గంటల సమయంలో బంజారాహిల్స్ లోని తాజ్ క్రిష్ణ హోటల్లో బస చేశారు. ఆయన అధికారిక షెడ్యూల్ ను చూసినప్పుడు శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన హోటల్ కే పరిమితం కావటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకిలా అన్న ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది.

ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన కొందరు అధినేతలతో హోటల్లో భేటీ అయ్యారు రాహుల్ గాంధీ. ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే తొలుత హోటల్ తాజ్ క్రిష్ణకు చేరుకున్నారు. ఆయన్ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకెళ్లటం గమనార్హం. హోటల్ కు వారిద్దరూ ఒకే కారులో రావటం.. వెంట పెట్టుకొని రాహుల్ వద్దకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దాదాపు పావు గంట నుంచి అరగంట మధ్యలో వారి భేటీ సాగినట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రజ్యోతి ఆర్కే తర్వాత టీవీ5 అధినేత నాయుడు.. సీవీఆర్ చానల్ అధినేత కూడా రాహుల్ ను కలిసిన వారిలో ఉన్నారు. వీరే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పోరాటం చేసిన పలువురిని రాహుల్ కలిశారు. వీరిలో గద్దర్.. విమలక్క.. కంచె ఐలయ్య లాంటి పలువురు ప్రముఖులు ఉన్నారు.గతంలో నగరానికి వచ్చిన సందర్భంలో రాహుల్ వ్యవహరించిన తీరుకు.. ఈసారికి తేడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News